Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపోర్షే చంపిన మనుషులు

పోర్షే చంపిన మనుషులు

పూనాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ధూమ్ ధామ్ మందు పార్టీలో తప్ప తాగి…అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు రెండు కోట్ల పోర్షే కారును నడుపుతూ రోడ్డుమీద వెళుతున్న ఇద్దరిని చంపిన మైనారిటీ తీరని ధన మదాంధుడి వార్త; బెంగళూరులో రేవ్ పార్టీకి ప్రత్యేక విమానం ఏర్పాట్ల వార్తను కలగలుపుకుంటే భవిష్యత్తులో మనం ఇలాంటి విజ్ఞాపనలు చూడవచ్చు.

గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు-
బలిసి…బాధ్యతలేని కలవారమైన మేము మా తరపున, మా ముక్కుపచ్చలారని ముక్కుపొడి పీల్చే అల్లారు ముద్దు పిల్లల తరపున చేసుకొను బహిరంగ విన్నపములు.

“యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్” అన్న సామెత మీకు తెలియనిది కాదు. కాబట్టి మీ స్వాతంత్య్రం మా ముక్కు ముందు ఆగిపోవాలి. అలా ఆగకుండా మేము, మా అల్లారు ముద్దు పిల్లలు ముక్కులోకి మాదక ద్రవ్యాలు పీలుస్తుండగా…మీరు ఆకస్మిక దాడులు చేసి…అరెస్టు చేయడం మా మనసులను కలచివేస్తోంది. యువర్ లాఠీ ఎండ్స్ వేర్ అవర్ నోస్ పౌడర్ బిగిన్స్. పైగా మొన్న మీరు అరెస్టు చేసిన చోట్లు మా సొంత ప్రాపర్టీలు. మా పిల్లలు రాత్రీ పగలు మాదకద్రవ్యాలు తీసుకుంటారని మేము భావించడం లేదు. ఏదయినా ఆనందం పొంగినప్పుడు, విషాదంతో కుంగినప్పుడు, వారాంతాల్లో, పండగ సెలవుల్లో, మిత్రులు కలిసినప్పుడు…పిసరంత స్టఫ్ తెల్లపొడి పీలుస్తుంటారు. మహా అయితే ఒక డోసు మూడు గ్రాములకు మించదు. మా అల్ట్రా నియో రిచ్, నయా రిచ్ ఇళ్లల్లో అందరికీ ఈ విషయాలు తెలుసు. రకరకాల వ్యాపారాల్లో మేము వేల కోట్లు సంపాదించాము. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక మా పిల్లలు గుర్రప్పందేలు, అమ్మాయిలు, విదేశీ క్యాసినో జూదాలు, రేవ్ పార్టీలు...ఇలా వారి బాధలేవో వారు పడుతున్నారు.

ఒకే ఇంట్లో ఒకే చూరు కింద ఉన్నా…మా ఆవిడ పుణ్యక్షేత్రాల సందర్శన, గోశాల నిర్వహణతో ఎప్పుడూ ఇంట్లో ఉండదు. మా అబ్బాయికి- కోడలికి మధ్య వాళ్ల డ్రైవర్ వల్ల ఏదో గ్యాప్ వచ్చిందని మా డ్రైవర్ అన్నాడు కానీ…విదేశాల్లో కొత్త ప్రాజెక్టు వల్ల నేను ఆ విషయం పట్టించుకోలేదు. మొన్న మీరు మా అబ్బాయిని అరెస్టు చేసే సమయానికి నేను ఉత్తరాదిన గంగాతీరంలో పుణ్యక్షేత్ర ఆలయ పునర్నిర్మాణానికి యాభై కోట్ల విరాళమిచ్చే పవిత్ర కార్యక్రమంలో ఉన్నాను.

మీరు బహుశా పల్లెలో మర్రి చెట్టు కింద జిల్లా పరిషత్ బళ్లో చదివి…జిల్లా కేంద్రంలో కిటికీలు ఊడిపోయిన డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసి ఉంటారు. మా అబ్బాయి ఊటీలో ప్రతిష్ఠాత్మక ప్రపంచ ప్రఖ్యాత గుడ్ షెపర్డ్ లో అక్షరాలు దిద్దుకుని…హార్వర్డ్ లో ఎం బి ఏ చేసి…కేవలం మన దేశాన్ని ఉద్ధరించాలని ఇక్కడికి వచ్చాడు. వాడికి సొంత విమానం కూడా ఉంది. అలాంటి వాడి మానాన్ని మీరు బజారున పడేస్తే…రేప్పొద్దున వాడు విమానంలో ఎలా తిరగగలడు? అన్న కొలమానం కాలమానంగా మమ్మల్ను నిలువునా దహించివేస్తోంది.

కొన్ని దేశాల్లో డ్రగ్స్ వాడకాన్ని అధికారికంగా అంగీకరించారు. మావాడు ఆ దేశాల్లో చదువుకుని రావడం వల్ల రోజూ హార్లిక్స్ పొడిలా పోషకాహారంగా వాడుతున్నాడు. నలుగురికి అదే మోతాదులో ఉదారంగా ఉచితంగా పంచిపెడతాడు. చిన్నప్పటినుండి వాడిలో దాతృత్వ గుణం పాళ్లు ఎక్కువ.

మా ఇంట్లో మా ఆవిడ పూజల కర్పూరం ఏదో, మావాడి పోషకాహార మాదక ద్రవ్యం ఏదో తెలియక తికమక పడుతుంటే మేమే ఇంట్లో కర్పూరం, బయట స్టఫ్ పెట్టుకోమని సలహా ఇచ్చాము.

మా కలవారి కష్టాలు మీ ఖాకీ కఠినాత్ములకు ఎలా తెలుస్తాయి? మేము చిరిగిన నిక్కర్లు వేసుకుని, పగిలిన పలక చేతబట్టుకుని…విరిగిన బలపం ముక్కతో వీధి బడిలో చదువుకున్నాము. రాత్రిళ్లు వీధి దీపమే దిక్కు. మా పిల్లలకు అలాంటి కష్టాలు ఉండకూడదని…పువ్వుల్లో పెట్టి పెంచాము. ఆ పువ్వులు ఎక్కువ కావడం వల్ల పూల పుప్పొడి ఉగ్గుపాలతో అలవాటై…దాని కొనసాగింపుగా తెల్లపొడి పీల్చడంగా అలవాటయ్యిందని సివిల్స్ పోటీ పరీక్షల్లో డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం చదువుకున్న మీకు మేము సామాజిక పరిణామక్రమానుగత గతితార్కిక మాదకద్రవ్య సేవన సహజ సూత్రాలను అంత లోతుగా చెప్పాల్సిన పనిలేదు.

మరో పక్క మొన్న మా కొవ్వెక్కిన అమ్మాయి తాగి అర్ధరాత్రి విధుల్లో ఉన్న హోంగార్డ్ బట్టలు చించిందని మీరు కేసు పెట్టడం కూడా భావ్యంగా లేదు. అల్లుడు వేరే అమ్మాయితో తాగుతుంటే… అమ్మాయి ఎవరితో తాగాలో తెలియక బాధ్యతగా, బాధగా, ఒంటరిగా తాగుతోంది. మా కుటుంబంలో డ్రైవర్ తో అమ్మాయి లేచిపోయిన గతానుభవం ఉండడంతో…ముందు జాగ్రత్తగా మా అమ్మాయికి డ్రైవర్ ను పెట్టలేదు. దాంతో తాగిన మా అమ్మాయి బాధ్యతగా అర్ధరాత్రి త్వరగా ఇల్లు చేరాలన్న తపన కొద్దీ రాంగ్ రూట్లో రయ్ మని వాయువేగంతో వస్తోంది. ఇలాంటి వేళ బాధ్యతగా పక్కకు తప్పుకోకుండా ఆఫ్టర్ ఆల్ హోం గార్డ్ అడ్డుపడి…కారును ఆపడం ఏమిటి చెప్పండి? న్యూసెన్స్ కాకపొతే! మొదటినుండి మా అమ్మాయికి బట్టలు చింపిరిగా ఉంటేనే ఇష్టం. ఆ ఇష్టం వల్ల హోంగార్డ్ బట్టలు పరాపరా చింపి…చిందులు వేసింది తప్ప…ఇందులో ఎలాంటి అమర్యాద, అనుచిత ప్రవర్తన, చట్ట ఉల్లంఘన జరగలేదని గుర్తించగలరు. తన ఒంటిమీద బట్టలుండడం ఇష్టం లేని సహజస్వభావంతో ఎదుటివారి ఒంటిమీద మా ఒంటరి అమ్మాయి బట్టలు చించుతూ ఉంటుందే తప్ప…అమ్మాయికి అధికారికంగా ఎలాంటి మెంటల్ సర్టిఫికెట్ లేదని కూడా గ్రహించగలరు.

అన్నట్లు-
మా కుటుంబం ఊరవతల మా సొంత అరవై ఎకరాల ఫార్మ్ హౌస్లో …పదెకరాల్లో పాలరాతితో కట్టిన గుడి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ భద్రతా ఏర్పాట్లు మీరే కదా చూస్తారు! మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. మనసులు కలవని మా అబ్బాయి- కోడలు; తనువులు కలవని మా అమ్మాయి- అల్లుడు గుడి ప్రారంభం పూజలో కూర్చుంటామని ఒప్పుకోవడంలో వారి హృదయ వైశాల్యాన్ని, లోక కల్యాణ పరతత్పరతను గమనించగలరు.

ఊరవతల పూరిపాకలో సారా కొట్టు దగ్గర రెండు బాటిళ్లు తాగి తలలు బద్దలు కొట్టుకునే చిల్లర మనుషులు కాదు మా పిల్లలు. ఏటా వేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఈ దేశ మహారాజ పోషకులు. ఈ దేశ నిర్మాణంలో వారి వాటా వారికి ఉంటుంది.

పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని...మా కలవారి పిల్లల మీద పెట్టిన మాదకద్రవ్య వాడకం కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రయివ్ మరియు హిట్ అండ్ రన్ కేసులన్నిటినీ తక్షణం బేషరతుగా ఉపసంహరించుకుని…అరెస్టయిన మా కుంగు బంగారు పిల్లలను విడుదల చేసి…వారి నెత్తిన ఎప్పటిలా తెల్ల పూల పుప్పొడి చల్లుకునే అవకాశం మాకు వెంటనే కల్పించాల్సిందిగా కోరుతున్నాము. లేని యెడల మా పిల్లల మనసు విరిగి…పుసుక్కున దేశం వదిలి వెళ్తే…ఈ దేశానికి కలిగే నైతిక, భౌతిక, రసాయన, ఆర్థిక నష్టానికి, జాతీయ స్థూల ‘ద్రవ్య’వినిమయ సూచీ పతనానికి మీరే పూర్తీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాము.

ఇట్లు,
మాదకద్రవ్యాలు, డ్రంక్ అండ్ డ్రయివ్ లు, హిట్ అండ్ రన్ కేసుల్లో ఉన్న కలవారు, వారి పిల్లల ‘ద్రవ్య’వినిమయ హక్కుల, వారి గౌరావాభిమానాల పరిరక్షణ ఐక్య పోరాట సమితి- భాగ్యనగర శాఖ.
తేదీ…
1 . కాపీ టు జాతీయ మానవహక్కుల సంఘం సెక్రటరీ!
2 . కాపీ టు రాష్ట్ర మానవహక్కుల సంఘం సెక్రటరీ!
3 . కాపీ టు సి ఎం!
4 . కాపీ టు పి ఎం!
5 . కాపీ టు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్