Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇది మెంటల్ వేళయని!

ఇది మెంటల్ వేళయని!

Mental Health Startups In India : 

మనసు మారినట్లు కనపడుతుంది. కానీ ఒక పట్టాన మారదు. మారాలని అనుకోదు. మారడానికి ఇష్టపడదు. మారడానికి ప్రయత్నించదు. ఇరవై సెకెన్లకు మించి మనసును ఒక అంశం మీద కుదురుగా ఉండనిస్తే మన మనసుమీద మనం కంట్రోల్ తెచ్చుకున్నట్లే అంటుంది మానసిక శాస్త్రం. అంటే మనసు అంత నిలకడ లేనిది.

ప్రపంచాన్ని కరోనా చాచి కొట్టేసరికి ఒక్కసారిగా భూగోళమంతా మానసిక సమస్యలు పెరిగాయట. కరోనా వచ్చినవారితో ఒక సమస్య. ఎక్కడ వస్తుందోనని ఒక సమస్య. ఎప్పుడు పోతుందో తెలియక ఒక సమస్య. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు ఒక సమస్య. చదువులు, ఉపాధి ఉద్యోగాలు ఒక సమస్య. ఇంట్లో కూర్చుని తినే బంగారు కొండలకు కొండంత వంటలు చేసి అరారా పెట్టడం ఒక సమస్య. ఆదాయాలు పడిపోయి చిల్లర ఖర్చులకు కూడా చిల్లర లేకపోవడం ఒక సమస్య. చిన్నా పెద్ద ఉన్న సమస్యలు, లేనివి- రానివి ఊహించుకుని భయపడడం ఒక సమస్య. చివరకు అన్నీ కలిసి మానసిక సమస్యలుగా మారిపోయాయి.

బుర్ర వేడెక్కుతోంది
కాసేపు కంప్యూటర్ వాడితే సీ పి యు వేడెక్కుతుంది. అందుకే ప్రాసెసర్ చల్లబడేలా ఒక ఫ్యాన్ ఉంటుంది. లేదా ఏ సి అయినా ఉండాలి. ఒకేసారి అనేక ఆలోచనలతో బుర్రలో ప్రాసెసర్ కూడా వేడెక్కుతుంది. ఎంత ఏ సీ ల్లో ఉన్నా బుర్ర వేడి తగ్గదు. ఆలోచనలను నియంత్రించుకుంటూ చల్లబరుచుకోవాల్సిందే.

పిచ్చి లేస్తోంది
పిచ్చి లేస్తోంది- అన్నది వాడుక మాట. నిద్ర లేవడం లాంటిది ఇది. అంటే పిచ్చి ఉంది. అది పడుకుని ఉంది. కొన్ని కారణాలవల్ల అది లేస్తుంది. మనం నిద్రలేచి ఒళ్లు విరుచుకున్నట్లు…మనలో పిచ్చి లేచి జడలు విరబోసుకుని నర్తిస్తుంది. ఆ పిచ్చి నర్తనను మనకు మనం గుర్తించగలుగుతాం. మనలో పిచ్చిని ఎదుటివారు కూడా స్పష్టంగా గుర్తించగలుగుతారు.

మైండ్ దొబ్బిందా?
దొబ్బు అంటే రాయలసీమ మాండలికంలో తోయడం అని అర్థం. అక్కడే తోయు అన్న మాటకు నూకు అని కూడా అంటారు. ఎందుకో కాలగతిలో దొబ్బు మాట గబ్బుగా మారింది. మైండ్ దొబ్బిందా? అంటే మైండ్ పోయిందా? లేదా? అని అర్థం. మైండ్ ను బలవంతంగా తోయడం వల్ల అది తనను తాను దొబ్బుకుంటూ వెళ్లి ఉంటుంది.

చిన్న మెదడు చిట్లిందా?
మన మెదడు రెండు భాగాలు అని ఇందులో అంతరార్థం. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా చిన్న మెదడు చిట్లి ఉన్నట్లు. పొట్ట, కాలు, చేయి చిట్లితే సూది దారంతో కుట్లు వేయవచ్చు. ఇనుము విరిగినా యినుమారు ముమ్మారు అతికించవచ్చు. మెదడు చిట్లితే కుట్లు వేయడం కుదరని పని.

మనో రోగానికి మందు లేదు
క్యాన్సర్ కు కూడా మందులుంటాయి. కీమో థెరపీలు, రేడియేషన్లు ఇంకా ఏవేవో ఉన్నాయి. మనో రోగానికి ఇప్పటి వరకు మందులు కనుక్కోలేదు. భవిష్యత్తులో కూడా కనుక్కోలేరు.

మైండ్ బ్లాంక్
తెలుగు సినిమా హీరో వల్ల మొత్తంగా తెలుగు భాషకే మైండ్ బ్లాంక్ అయ్యింది. దీని మీద చర్చ అనవసరం. సమయం వృథా.

మనో వేగం
సూపర్ సోనిక్ శబ్దవేగం కంటే మనసు వేగం ఎక్కువ. దానికి స్పీడ్ లాక్ లేనే లేదు.

మనసా వాచా కర్మణా
మనసు- మాట- చేతలు అన్నీ ఒకటి కావాలి. మూడింటి మధ్య సింక్ ఉండాలి. అదొక యోగం. అందరికీ సాధ్యం కాదు. కానీ అసాధ్యమేమీ కాదు.

మనసొక మధు కలశం
మనసొక అందమయిన పాత్ర. అందులో మనం ఏ ఆలోచనలు నింపితే అది దాంతోనే నిండిపోతుంది.

మనసులోని మర్మమును తెలుసుకో
మనసులోతులు తెలిసినవాడు కాబట్టి త్యాగయ్య తన మనసులోని మర్మమును తెలుసుకో అని అయోధ్య రాముడికే సైకలాజికల్ టెస్ట్ పెట్టాడు. రాముడు పాస్ కాకుండా ఎలా ఉంటాడు? త్యాగయ్య మనసు చదివి ఆయన్ను తరింపచేశాడు.

మనసుంటే మార్గముంటుంది
ఎన్ని మార్గాలు మూసుకుపోయినా మనసుంటే ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది.

మైండ్ ఈజ్ అవర్ బిజినెస్
మైండ్ యువర్ బిజినెస్ అంటే నీ పని నువ్ చూసుకో, నీ హద్దులో నువ్ ఉండు, ఇంకొకరి పనిలో కలుగజేసుకోవద్దు అని.

కరోనా దెబ్బకు పెరిగిన మానసిక సమస్యలకు తగినంత మంది నిపుణులు, డాక్టర్లు, కౌన్సిలర్లు అందుబాటులో లేరట. మానసిక రోగులకు సేవలందించే ఆన్ లైన్ కంపెనీలకు కూడా డిమాండ్ పెరిగిందట.

మానసిక వైద్యం, మందులు, పరిశోధనలకు సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీల్లో పెట్టుబడుల వరద ప్రవహిస్తోందట. సాధారణంగా ఏటా ఇలాంటి స్టార్ట్ అప్ కంపెనీల్లో పెట్టే పెట్టుబడులతో పోలిస్తే కరోనా తరువాత పెట్టుబడులు దాదాపు ఐదింతలు పెరిగాయట.

అంటే-
భవిష్యత్తును మెంటల్లో దర్శించారు పెట్టుబడిదారులు. భవిష్యత్తులో మనం వినబోయే పారిభాషిక పదాలు ఇలా ఉండవచ్చు.

# మెంటల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్
# మెంటల్ సర్వీసెస్
# మెంటల్ కంపెనీ
# మెంటల్ బిజినెస్
# మెంటల్ ప్రాఫిట్స్
# మెంటల్ ఇన్సెంటివ్స్
# మెంటల్ గ్రోత్ కారిడార్
# స్పెషల్ మెంటల్ ఎకనమిక్ జోన్
# జాతీయ స్థూల మెంటల్ సూచి
# స్థూల మెంటల్ తరుగుదల
# మెంటల్ రిపోర్ట్
# ఫ్యామిలీ మెంటల్ బడ్జెట్
# మెంటల్ రూమ్
# మెంటల్ క్లాస్
# మెంటల్ మెంటార్

ఈ మెంటల్ పరిభాషకు అంతు ఉండదు. సృష్టి ఆదిలో మెంటలే ఉండెను. మధ్యలో మెంటల్ లేనట్లు ఉండెను. కరోనాతో అది మళ్లీ తొంగి చూసెను. సృష్టి అంతంలో కూడా మెంటలే ఉండును!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఇరవైల్లో అరవైల ఆలోచనలు

Also Read: వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్