It is Fate: Roja on Babu
చంద్రబాబు ఆవేదనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. అయన ఎంతో మందిని ఎడిపించారని వారి ఉసురు తగిలి ఇలా అయ్యిందని, ఈ దొంగ ఎడుపులకు ఎవరూ జాలిచూపరని విమర్శించారు. ‘విధి ఎవరినీ వదిలిపెట్టదు..అందరి సరదా తీరుస్తుందం’టూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను 72 ఏళ్ళ వయసులో ఎంతో ఏడ్పించారని, కానీ చంద్రబాబుకు 71 ఏళ్ళ 7 నెలలకే ఏడ్చే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని పెద్దలు అంటారని గుర్తు చేశారు రోజా.
భువనేశ్వరిని ఏదో అన్నారని చంద్రబాబు చాలా బాధపడుతున్నారని, కానీ గతంలో అయన అధికారంలో ఉన్నప్పుడు పీతల సుజాతతో హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా తనపై అసభ్యంగా మాట్లాడించిన విషయం మర్చి పోయారా అంటూ ధ్వజమెత్తారు. మాకు ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరా అని రోజా నిలదీశారు. వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిల లను కూడా ఎంతో బాధించే విధంగా ఎన్నో మాటలు మాట్లాడారని, ఆఖరికి ప్రధాని మోడీని కూడా విడిచి పెట్టకుండా ఎవరిని ఏవిధంగా మాట్లాడారో అందరికీ తెలుసన్నారు.
తెలుగుదేశం పార్టీకోసం పదేళ్ళపాటు కష్టపడి పనిచేసిన తనను మానసికంగా ఎంతో క్షోభ పెట్టారని, తన వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ప్రవర్తించారని, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, విమెన్ పార్లమెంట్ సదస్సు జరిగితే కనీసం తనను బహిష్కరించి అవమానపరిచారని, 24 గంటలపాటు తనను రోడ్ల వెంట తిప్పి ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో పడేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : భోరున విలపించిన బాబు