Sunday, November 24, 2024
HomeTrending Newsహైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో డేటా సైన్స్ – అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంతో హైదరాబాద్ లో రోచె ఫార్మా తన అత్యాధునిక గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను ఏర్పాటు చేసింది. డేటా విశ్లేషణ, సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇది భారతదేశంలోనే రెండవది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోచె ఫార్మా అనుబంధ సంస్థలతో కలిసి ఈ సెంటర్ పనిచేస్తుంది. హెల్త్ కేర్ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు వినియోగదారుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చే లక్ష్యంతో ఈ సెంటర్ పనిచేస్తుంది. ఇవాళ హైదరాబాద్ లో మంత్రి కే.తారకరామారావుతో రోచె ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సింప్సన్ ఇమ్మాన్యుయెల్ సమావేశం అయ్యారు. 2020 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలతో పాటు ఈ సంవత్సరం మే నెలలో రోచె చైర్మన్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పారిశ్రామిక, ఫార్మా రంగంలో హైదారబాద్ కు ఉన్న అనుకూలతలను వివరించారు. మంత్రి కేటీఆర్ సమావేశాల తరువాత హైదరాబాద్ లో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకున్నామని ఇమ్మాన్యుయెల్ తెలిపారు. తాజా విస్తరణ ప్రణాళికలతో 2022 చివరి నాటికి 100 మంది నిపుణులతో ఈ సెంటర్ పనిచేస్తుందన్నారు.

హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసిన అంతర్జాతీయ కంపెనీల సరసన రోచె ఫార్మా చేరినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలు కలిగిన మరో నగరం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చినాక కల్పించిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో పాటు నైపుణ్యం కలిగిన నిపుణులతో దేశంలోని ఏ నగరానికి లేని ప్రత్యేకతలు హైదరాబాద్ కు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి తమ ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమన్నారు. తాజా డేటా సెంటర్ తో రోచె ఫార్మా, తెలంగాణ ప్రభుత్వం మధ్య అనుబంధం మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తపరిచారు. రోచె ఫార్మా లక్ష్యాన్ని ఈ డేటా సెంటర్ చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు.

రోచె ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ వి. సింప్సన్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ, “ఐటి, అనలిటిక్స్, డేటా సైన్స్ లో భారతదేశం గ్లోబల్ లీడర్‌ అన్నారు. GATE యొక్క కార్యకలాపాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఐటీ ప్రగతిలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని తమ గేట్ సెంటర్‌లో డేటా సైన్స్ ,అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సంబంధిత సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నామన్న ఇమ్మాన్యుయేల్, భవిష్యత్తులో డేటా మేనేజ్‌మెంట్, DevOps రంగాలకు విస్తరిస్తామన్నారు. రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో గేట్ తో దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి యం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

1896లో స్థాపించబడిన రోచె ఫార్మా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ లో ఉంది.ఆంకాలజీ, ఇమ్యునాలజీ, అంటువ్యాధులు, ఆప్తాల్మాలజీ, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల మందుల తయారీలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్ కంపెనీ . విట్రో డయాగ్నస్టిక్స్ , టిష్యూ-బేస్డ్ క్యాన్సర్ డయాగ్నస్టిక్స్‌తో పాటు డయాబెటిక్ మేనేజ్ మెంట్ లో రోచె ఫార్మా ప్రపంచలోనే అగ్రగామి సంస్థ. ఈ కంపెనీ సుమారు 62 బిలియన్ అమెరిక్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ఉద్యోగులు రోచె ఫార్మా లో పనిచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్