Come to watch: కేటిఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి వ్యాఖ్యానించి ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ అని ఉంటే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. కేటిఆర్ కామెంట్లు తాను కూడా వాట్సప్ లో చూశానని, ఆయన్ను ఓ యంగ్, డైనమిక్, ఇన్స్పిరేషనల్ లీడర్ గా తాము గుర్తిస్తామని, పొరుగు రాష్ట్రం అన్నారు కానీ ఏపీ అనలేదని రోజా చెప్పారు. నేడు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను రోజా కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కల్వకుంట్ల కవిత రోజాకు బొట్టుపెట్టి సాదరంగా స్వాగతం పలికారు. కేసీఆర్ తనను కుటుంబ సభ్యురాలిగా, ఓ కూతురిగా చూస్తారని అందుకే మంత్రి పదవి వచ్చిన తర్వాత అయన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని రోజా వెల్లడించారు. కేసిఆర్ కుటుంబాన్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ సందర్భంగా నేడు ఏపీ పరిస్థితిపై కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు రోజా సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర మంత్రిగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని కేటిఆర్ కు దగ్గరుండి చూపిస్తానని, సిఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, గ్రామ సచివాలయ వ్యవస్థను తమిళనాడు కూడా అమలు చేయబోతోందని, ఈ విషయమై అక్కడి అసెంబ్లీ తీర్మానం కూడా చేసిందని చెప్పారు.
కేటిఆర్ కు చెప్పిన ఆ ఫ్రెండ్ ఎవరో తప్పుగా చెప్పారని, తమ రాష్టానికి వస్తే నాడు-నేడు కింద బాగు చేసిన స్కూళ్ళు, ఆస్పత్రులు, కోవిడ్ పూర్తయిన తర్వాత బాగు చేస్తున్న రోడ్లు, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఆయనకు చూపిస్తానని వివరించారు. తెలంగాణాలో కూడా ఇలాంటివి పెట్టాలని అనుకుంటారని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో కరెంట్ కోతలు సాధారంగానే ఉంటాయని, దేశంలోని 16 రాష్టాల్లో ఈ సమస్య ఉందన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, పక్కనున్న వారు చెప్పిన దాన్ని నమ్మి మాట్లాడితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు,
Also Read : మా గ్రామాల్లో వ్యవస్థలు చూడండి: అమర్నాథ్ సలహా