Thursday, March 19, 2026
HomeTrending NewsOne Lakh Scheme: కుల వృత్తుల రక్షణకే లక్ష ఆర్థిక సాయం - మంత్రి హరీష్...

One Lakh Scheme: కుల వృత్తుల రక్షణకే లక్ష ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు

కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించాటానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గం స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు, చేనేత మిత్ర వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు.600 కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ, గీత కార్మికులకు చెట్లు పన్ను, పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ..ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.

కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నాము.

జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని మంత్రి వివరించారు. త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular