శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల వలసలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ కు RS ప్రవీణ్ కుమార్ చేరిక పెద్ద ఉపశమనం. లోక్ సభ ఎన్నికలకు నైతిక స్థైర్యం ఇచ్చిందనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకు వెళ్లాలని తర్జనభర్జన పడుతున్న గులాబీ అధినేత ఇక బహుజన వాదాన్ని అందుకోనున్నారు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు ప్రవీణ్ కుమార్ తో కలిసి ప్రచారం ఉదృతం చేయనున్నారని తెలిసింది.
దళితబందుతో విమర్శల పాలైన కెసిఆర్ దాన్నే మళ్ళీ ఎన్నికల అంశం చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా మాదిగ సామాజికవర్గం ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్దం అయ్యారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం SC జనాభా ఉండగా అందులో 60 శాతం మాదిగ సామాజికవర్గం ఉంటుందని అంచనా. ఇది రాష్ట్ర జనాభాలో 9 శాతం పైనే ఉంటుందని సమాచారం. ప్రవీణ్ కుమార్ రాకతో ఈ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో టిడిపి కనుమరుగు అయ్యాక మాదిగలకు రాజకీయ అండ లేకుండా పోయింది. కాంగ్రెస్ లో మాల సామాజికవర్గందే పై చేయి. బిజెపి మాదిగలకు ప్రాధాన్యత ఇస్తున్నా అవకాశాలను అందుకునే స్థాయిలో ఆ వర్గం నుంచి నేతలు లేరని అంటున్నారు. గుంపులో గోవిందం మాదిరి వ్యవహరించిన బీఆర్ఎస్ ఇప్పుడు మాదిగల గొంతుగా మారనుందని గులాబీ నేతలు చెపుతున్నారు.
2009లోనే నాగర్ కర్నూల్ ఎంపిగా కారు గుర్తు మీద పోటీ చేయమని ప్రవీణ్ కుమార్ ను కెసిఆర్ కోరినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తన స్థాయిని అధికంగా ఉహించుకున్న ప్రవీణ్ కుమార్ స్వేరోస్ అండతో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తా అనే ఆలోచనతో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. కాగజ్ నగర్ లో పోటీతో క్షేత్రస్థాయి పరిస్థితులు అనుభవంలోకి వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిలో చేరితే బాగుండేదని మరికొందరు వాదిస్తున్నారు. కమలం పునాదులు బలోపేతం చేసే ఆలోచనలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం మాదిగ వర్గం నేతలను ప్రోత్సహించే పనిలో ఉంది. బిజెపిలో బ్రాహ్మణవాదం, అగ్రకులాల పెత్తనం ఉంటుందనే బిజెపి వైపు వెళ్ళే ఆలోచన విరమించుకున్నట్టు వినికిడి.
బీఎస్పీ అధినేత్రి మాయావతి ధోరణి గిట్టక గులాబీ గూటికి చేరిన ప్రవీణ్ కుమార్ ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయని ఎలా అనుకున్నారు. కెసిఆర్ దర్శనం దొరకటం పార్టీ నేతలకు ఇప్పటికీ గగనమే. ఉన్నతాధికారిగా కెసిఆర్ వ్యవహార శైలిని దగ్గర నుంచి ఎరిగిన ప్రవీణ్ కుమార్… కెసిఆర్ కు ట్యూన్ అయ్యారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
శాసనసభ ఎన్నికల్లో ఓటమి, కలేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు… ఇలా కష్ట కాలంలో ఉన్న కెసిఆర్ కు ప్రవీణ్ కుమార్ రాక కలిసివస్తుందని విశ్లేషణ జరుగుతోంది. నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగితే కారు గెలుస్తుందని.. అటు వరంగల్, పెద్దపల్లి స్థానాల్లో కూడా సమీకరణాలు మారతాయని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు.
-దేశవేని భాస్కర్