Sunday, September 8, 2024
HomeTrending Newsబీఎస్పీకి ప్రవీణ్ కుమార్ గుడ్ బై - త్వరలో బిఆర్ఎస్ లో చేరిక

బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ గుడ్ బై – త్వరలో బిఆర్ఎస్ లో చేరిక

విశ్రాంత ఐపీఎస్ అధికారి, స్వేరో వ్యవస్థాపకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి రాజీనామా చేశారు.  తన ఉద్యోగానికి  స్వచ్చంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత మాయావతి నాయకత్వంలోని బిఎస్పీ లో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.  ఇటీవలే అయన బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్ ను కలిసి పొత్తు చర్చలు జరిపారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక విమర్శలు వచ్చాయి. ఈ కలయికను నిరసిస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ వల్లే తాను ఓటమి చెందాల్సి వచ్చిందని కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు.

మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో బిఎస్పీ-బిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని కెసిఆర్-ప్రవీణ్ లు ప్రకటించారు. దీనిపై కూడా  బిఎస్పీలో విభేదాలు పొడచూపాయి. ప్రవీణ్ ది ఏకపక్ష నిర్ణయమని దీనికి మాయావతి మద్దతు లేదని కొందరు బహిరంగంగానే ప్రకటించారు. అయితే మాయావతి అంగీకారంతోనే తాను కెసిఆర్ ను కలుసుకున్నానని ఆయన వెల్లడించారు.   పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీట్లు బిఎస్పీకి కేటాయిస్తున్నామని నిన్న బిఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. నిన్ననే కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం విదితమే. కవిత అరెస్టును ప్రవీణ్ కుమార్ ఖండించారు.

“బిఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు….. ” అంటూ పోస్ట్ చేశారు. దీనిపై కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో దమ్ముంటే కవితను అరెస్టు చేయాలంటూ ఆయన చేసిన డిమాండ్ ను రీట్వీట్ చేశారు.

ఇది జరిగిన గంటలోపే అయన బిఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు మరోసారి కెసిఆర్ తో భేటీ అయిన ప్రవీణ్ అతి త్వరలో లాంఛనంగా బిఆర్ ఎస్ లో చేరతారని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్