Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాసు కప్ప గర్వభంగం

కాసు కప్ప గర్వభంగం

పురాణ ప్రవచనకారులు అనేక పిట్ట కథలు చెప్పక తప్పదు. అసలు కథ బలంగా మన మనసుల్లో నాటుకోవాలంటే ఏవేవో ఉదాహరణలతో జరిగినవీ, జరగనివీ కల్పించి అయినా చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న గొప్ప కథ ఇది.

ఒక ఊళ్లో అనేక ప్రాకారాలతో పెద్ద గుడి. గుడికి వెళ్లే దారిలో వీధి పొడవునా అటు ఇటు భిక్షగాళ్లు అడుక్కుతింటూ ఉంటారు. రోజూ ఉదయాన్నే ఒక ఏనుగును గుడి ప్రధాన ద్వారం దగ్గరికి మావటివాడు తీసుకొచ్చే ముందు భిక్షగాళ్లందరూ లేచి…పక్కకు వెళతారు. ఏనుక్కు పూజ అయి వెనక్కు వెళ్లిపోయాక మళ్లీ ఎక్కడివాళ్లక్కడే కూర్చుంటూ ఉంటారు. ఇది రోజూ జరిగే అలవాటైన తంతే.

ఒకరోజు ఒక భిక్షగాడు లేచి సర్దుకునేలోపు ఏనుగు దగ్గరికి వచ్చేస్తోంది. ఎవరైనా డబ్బిస్తే పరచుకున్న గోనె సంచి కింద పెట్టుకోవడం భిక్షగాళ్ల అలవాటు. త్వరగా బయటపడాలన్న కంగారులో గోనె సంచిని గోడ మీద వేసి…భిక్షగాడు పక్కకు వచ్చాడు. అందులో ఇరుక్కున్న ఒక పావలా బిళ్ల గోడకు ఊడిన ఇటుకల మధ్యలో పడింది. ఆ ఇటుకల మధ్య ఉన్న కప్ప నోట్లో ఆ పావలా బిళ్ల పడింది. అదిప్పుడు కొత్తగా నోట్లో వచ్చి పడ్డ కలిమితో బలిసిన కప్ప అయ్యింది. వెంటనే వీధి మధ్యకు వచ్చి బెకబెక బదులు పకపక నవ్వుతూ నిలుచుంది.

మహా మహా భిక్షగాళ్లే లేచి వెళ్లిపోయారు. నువ్వు కూడా పక్కకు జరుగు. కావాలంటే ఏనుగు వెళ్లిపోయాక నడిరోడ్డుమీద నాలుగు కాళ్లతో నాట్యం చేద్దువు కానీ…అని మావటివాడు పెద్దమనసుతో కప్ప బాగుకోరి నయనా భయానా చెప్పి చూశాడు.

పో పోవోయ్!
నేనిప్పుడు ఇదివరకటి నిరుపేద కప్పను అనుకున్నావా? మా కప్పల జాతిలో ఎవరికీ ఎప్పటికీ దొరకని పావలా బిళ్ల తనంతట తానే వచ్చి నా నోట్లో పడింది...తొక్కలో ఏనుగయితే ఏంటి? నువ్వయితే ఏంటి? పెద్ద చెప్పొచ్చావ్! పో పో! పని చూసుకోపో! అని ధనమదంతో బలంగా చెప్పింది. ఈలోపు ఏనుగు బలమైన కాలు కప్పమీద పడడం, కప్ప చావడం జరిగిపోయాయి. మళ్లీ పావలా బిళ్ల భిక్షగాడికే చేరింది.

నీతి ఏమిటయ్యా అంటే-
ఎంతటి నోరులేని కప్పకయినా డబ్బు కళ్లజూడగానే నోరు లేస్తుంది. నడమంత్రపు సిరిలా డబ్బు, అధికారం, హోదా రాగానే ఎవరైనా పెద్దా చిన్నా మరచిపోతారు. తమ స్థాయి ఏమిటో తెలుసుకోలేరు. చివరికి కాలమనే ఏనుగు కాలుకింద ఈ కథలో కప్పలా పడి…నలిగి…నామరూపాలు లేకుండా పోతారు.

బహుశా చైనావాడికి ఈ కథ తెలిసినట్లుంది. అందుకే నోట్లో కాసుతో ఉన్న కప్ప బొమ్మను వాకిట్లో పెట్టుకుంటే వాస్తుదోషం పోతుందని ఒక ఆచారం ఏర్పడి…ఆ కాసు బొమ్మ కప్ప ఆచారం భారత్ కు కూడా వచ్చినట్లుంది. దానివెనుక దాగిన నీతికథ మాత్రం వెనక్కు వెళ్లినట్లుంది!

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ఆర్ ఎస్ ఎస్ అధిపతి మెహన్ భగవత్ ఉద్దేశపూర్వకంగానే ఎవరినో ఉద్దేశించి ఒక నీతికథ చెప్పారు. “మనిషి మొదట సూపర్ మ్యాన్ కావాలనుకుంటాడు. తరువాత దైవాంశ సంభూతుడు కావాలనుకుంటాడు. ఆపై దేవుడిగా పూజలందుకోవాలనుకుంటాడు. చివరిగా విశ్వమంతా వ్యాపించే విశ్వరూపుడు కావాలనుకుంటాడు”.

ఏమిటో!
మనలాంటి సామాన్యులు ఈ ప్రతీకలను ఎలా అర్థం చేసుకోవాలో!

సమయానికి ఆ కథలో కప్ప కూడా లేదు. తొందరపడి ముందే చచ్చింది!

ఆ మావటివాడో, ఆ భిక్షగాడో నోరు తెరిచి ఏమన్నా చెబితేనే కదా మనకు కాసు కప్ప గర్వభంగం కథ అయినా; మోహన్ భగవత్ విశ్వరూప స్వప్నభంగం కథ అయినా సరిగ్గా అర్థమై చచ్చేది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్