తమిళనాట మాత్రమే కాదు .. తెలుగులోనూ లారెన్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. కొంతకాలం పాటు హారర్ కామెడీ సినిమాలతో సందడి చేసిన లారెన్స్, ఈ మధ్య కాలంలో ఆ తరహా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన సినిమానే ‘రుద్రుడు’. ఈ సినిమా కూడా హారర్ టచ్ తో నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి ఆయన యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చాడు.
తమిళంత్తో పాటు తెలుగులోను ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. మదర్ సింటిమెంట్ ప్రధానంగా .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. కథ ట్రాక్ ఎక్కడానికి చాలా సమయం తీసుకోవడమే ఇందుకు కారణమనే టాక్ బలంగా వినిపించింది. చాలా గ్యాప్ తో వచ్చిన లారెన్స్ కి ఈ సినిమా రిజల్టు నిరాశనే మిగిల్చింది. ఆయన అభిమానులను అసంతృప్తికి గురిచేసింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. లారెన్స్ యాక్టింగ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. అలాగే సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కథలో కొత్త పాయింట్ కూడా ఉంది. మొదటి అరగంట ఓపికతో కూర్చుంటే, ఆ తరువాత ఆకట్టుకునే కథనే ఇది.