Thursday, April 3, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-8

పెనుగొండలక్ష్మి-8

Penugonda Temples: పెనుగొండలో రాతి పలకలు ఆలయాలై జీవసౌందర్య మహిమను నింపుకున్న కళామందిరాలయ్యాయి. భక్తి ప్రభా పుంజాలను వెదజల్లే పరమగురువుల్లా ఉన్నాయి. మతం పేరుతో పరస్పర మానసిక బంధం ఏర్పరిచే గొలుసులవి. కళ్లకు కనపడని సూక్ష్మస్వరూపుడిని కనిపింపజేసే మహిమాన్విత మందిరాలివి. దారిన పోయేవారికి నీడనిచ్చే చోట్లు. అలాంటి గొప్ప ఆలయాలు నేడు పాడుబడి ఉన్నాయి.

ఈ శిలలను పైకెత్తడానికి ఎంతటి ఏనుగులకైనా తలతిరుగుతుంది. ఎలా ఇంతటి రాతి పలకలను అంతెత్తున పేర్చి ఆలయాలు కట్టారో! ఎలా చెక్కి ఈ రాతి స్తంభాల మల్లె తీగలకు ప్రాణం పోశారో! ఎలాంటి లేపనాలు, రంగుల మిశ్రమాలతో ఈ ఆలయాల గోడల మీద యుద్ధగాథలను చిత్రించారో! ఏ యంత్రాలతో వీటికి తుదిమెరుగులు దిద్ది చిరాయువు పోశారో! ఇప్పుడు ఊహించడానికి కూడా వీలుకానన్ని విద్యలు అప్పుడు వారికి సహజంగా, స్వాభావికంగా ఉండేవేమో! ఆ మహాశక్తికి ఆ కాలజీవనమే కారణం అయి ఉండాలి!

ఈ స్తంభాలు ఒకప్పుడు నిండు పున్నమిలా వెలిగిన వెలుగులకు గుర్తులేమో! ఈ శిల్పాలు అప్సరసల రసికతకు ప్రతిరూపాలేమో! శిలలో మొగ్గ తొడిగిన ఈ తీగలు రేకు విప్పిన తాత్వికతకు సంకేతాలేమో! అద్దాల్లా మెరుస్తున్న ఈ శిల్పాలు శిల్పుల శాంతకళా ప్రతిభకు ప్రతిబింబాలేమో! ఇక్కడ చెక్కిన శిల్పాలు అచంచలమైన పారమార్థిక దృష్టికి ఫలితమేమో! ఈ మహాశిల్ప నిర్మాణశక్తి ఒక నూత్న సిద్ధి సంపద ఏమో!

అంత గొప్ప ఆలయాల గోడలమీద అశ్రుధారలు చారలు కట్టాయి. అనన్యసామాన్యమైన ఆలయ నిర్మాణ కౌశలం దుమ్ముకొట్టుకుపోయింది. కాలపు కోరల్లో చిక్కుబడిపోయింది.

ఈ ఆలయాల్లో కలామతల్లి కొలువుతీరి ఇక కూర్చోదా? సకల జీవవృత్తికి ఆధారమైన దివ్యశక్తి ఈ ఆలయాల్లో ఇక చరించదా? జ్ఞానదీప్తులు వెదజల్లే ఆధ్యాత్మిక శక్తి ఈ ఆలయాల్లో ఇక కనిపించదా? సంగీత, సాహిత్య సౌరభాలు ఈ ఆలయాల్లో ఇక దొరకవా? విమలతత్వాన్ని బోధించే ఏకాంత దివ్యపదవి ఈ ఆలయాల్లో ఇక దొరకదా?

చీకటి రాత్రి వేళల్లో ఈ ఆలయాల్లో కీచురాళ్లు కృష్ణరాయల కీర్తిని ఇక గానం చేయలేవా? తెలుగు పూపొదల పరిమళాలు ఇక గుప్పుమని చల్లవా? ఈ చీకటి పుట్ట దాటి విద్యారణ్యస్వామి యశస్సు గజ్జెకట్టి ఆడదా? ఇక్కడి ప్రకృతి తెలుగురాజుల చేత ఇక ప్రబంధాలను రాయించదా?

కంటికి కనపడని పరమాణువులు కూడా ప్రస్తుత పెనుగొండ ఆలయాల దీనస్థితిని చూసి తపించిపోతాయి. మనసున్న మనుషులు వీటిని చూసి ఎలా తట్టుకోగలుగుతారో?

అమిత పరాక్రమమాలను నూరిపోసిన విరూపాక్ష శక్తి ఈ ఆలయాలను కాపాడలేకపోయిందా? విద్యుత్తులా వెలిగిన మౌని విద్యారణ్యస్వామి విద్వత్తు ఈ ఆలయాలను రక్షింపలేకపోయిందా? కృష్ణదేవరాయల కరకు కత్తి ఈ ఆలయాలకు రక్షగా నిలువలేకపోయిందా?

శిల్పుల గుండెల్లో పిడిబాకులు గుచ్చినట్లు…ఈ ఆలయాల్లో అపురూప శిల్పాలను మహమ్మదీయ సేనలు కక్షగట్టి…గుచ్చి గుచ్చి ముక్కలు చేస్తుంటే… పైనున్న దేవతలయినా చేతులు అడ్డుపెట్టలేకపోయారా?

మునుల తేజోబలం వేదమంత్రాలై జ్వలిస్తున్నంతవరకు;
పూర్వ తరాల వారి తత్వ సంపద ఎంతో కొంత మిగిలి ఉన్నంతవరకు;
మన మహిమలను తల్లులు కథలుగా చెబుతూ పిల్లలను ఉయ్యాలల్లో ఊచినంతవరకు;
కర్తవ్యదీక్ష కోసం ఆత్మార్పణం చేసుకునే త్యాగదీప్తులు వెలిగేంతవరకు-
ఈ జగాలన్నీ ఒక్కటై మీదపడినా…
మా భావనా ప్రపంచంలో గూడుకట్టుకున్న ఈ గుడి గోపురాల ఎత్తు తగ్గదు. వాటి ప్రభకు లోటు లేదు.

Images Courtesy: Jakka Suresh blog

రేపు:
పెనుగొండలక్ష్మి-9
“పెనుగొండ శిల్పం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్