రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోందని, వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, దీనిపై ఎమ్మెల్యే పయ్యావుల ఫిర్యాదుతో విచారణ జరిపి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారని జడ్పీ సీఈఓ లు స్వరూపరాణి, భాస్కర్ రెడ్డి అనే అధికారులను తొలగించారని చెప్పారు. అధికార పార్టీలు గతంలో టిడిపి, ఇప్పుడు వైఎస్సార్సీపీలు ఓటర్ లిస్టు లను టాంపరింగ్ చేస్తున్నారని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఉండేవారి ఓట్లను తొలగిస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఇది వికృత రూపం దాల్చిందని, వాలంటీర్లు పంపిన సమాచారంతో అవకతవకలు చేస్తున్నారని, దీనికోసం హైదరాబాద్ లో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓటర్ చేతన్ మహాభియాన్ లో ఆమె పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ నార్త్ లో 271 బూత్ లలో రెండు లక్షల 60 వేల ఓట్లు ఉంటే… వీటిలో 70వేల ఓట్లు డూప్లికేట్, అర్హులు కానివారు ఉన్నారని ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆందోళనతో తనకు చెప్పారని ఆమె వివరించారు. జాబితా సవరణలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె విమర్శించారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం స్థానికంగా కమిటీలు వేయాలని జిల్లా నేతలకు సూచించారు.