తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ఆదేశించారు. రైతు బంధు నిధులు ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం 7600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడిని అందిస్తోంది. వ్యవసాయ రంగంలో ఈ పథకం విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తోంది. ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్‌తో పాటు, రైతు బీమాతో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా.. దేశ వ్యవసాయ రంగ నమూనా మార్పునకు దారితీసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
‘పలు మార్గాల నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా.. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతు బంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలి..’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.