అన్నమయ్య 32 వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి, భద్రపరిస్తే… వాటిలో 14,932 మాత్రమే కాలానికి దక్కాయి. దొంగలు దొంగిలించినవి కొన్ని. అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి కొన్ని. పోయినవాటి గురించి ఏడ్చి లాభం లేదు.
ఉన్నవాటి గురించి లోకానికి తెలియడానికి మాత్రం దాదాపు 350 ఏళ్లు పట్టింది. తిరుమల గోపురం గూట్లో మూడున్నర శతాబ్దాల పాటు మట్టిలో మట్టిగా దుమ్ముకొట్టుకుపోయిన అన్నమయ్య కీర్తనలను వెలికి తీసి, పరిష్కరించి, అప్పటి తెలుగు లిపిని అర్థం చేసుకుని…ఇప్పటి తెలుగు లిపిలోకి వాటిని ఎత్తి రాసి, రాగాలను నిర్ణయించిన మహానుభావుల గురించి తెలుసుకోకపోతే చరిత్ర మనల్ను క్షమించదు.

అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి లోకానికి ప్రసాదించినవారిలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ అగ్రగణ్యులు. వీరిలో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.

“రాగం తెలియని జాతి రాగి రేకులను కరిగించుకు తిన్నది” అని ప్రఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గుండెలు బాదుకున్నాడు. 1919లో తిరుమల ఆలయంలో పేష్కార్ ఉద్యోగిగా చేరి…1921లో రాగిరేకుల నుండి అన్నమయ్య కీర్తనలను ఎత్తి రాసి, ప్రచురణకు వీలుగా పరిష్కరించే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టినవారు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి(1889-1981). ఆయన పని మొదలు పెట్టిన నాటికి టీ టీ డి పుట్టనే లేదు. (ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుమల ఆలయ నిర్వహణను హథీరాం మఠం- మహంతుల చేతిలో పెట్టింది. 1933లో టీ టీ డి ఏర్పడేవరకు ఆలయ బాధ్యతలు వారే చూసుకున్నారు) ఆయన వేసిన తోవలో తరువాత నడిచినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ.
సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి ఇప్పటి తరం తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
ఆయన పరమ సాత్వికుడు. ఉదయం మెట్లెక్కి కొండ మీదికి వెళ్లడం…రోజంతా శాసనాలు రాసుకోవడం…రాత్రికి కిందికి దిగి…చమురు దీపాల వెలుగులో వాటిని ఎత్తి రాసుకోవడం…అన్నమయ్య రాగి రేకులను 1922లో వెలికి తీయించింది ఆయనే. కొన్ని అధ్యయన పీఠాలు, కొన్ని యూనివర్సిటీలు కలిసి చేయాల్సినంత పనిని ఆయన ఒక్కడుగా చేశారు. పాతికేళ్లపాటు ఆలయంలో, పదవీ విరమణ తరువాత బయట ఆయన కృషి అనన్యసామాన్యం. వందల ఏళ్ల కిందటి సంస్కృతం, తమిళం, తెలుగులో ఉన్న శాసన భాషను చదివి…పొల్లుపోకుండా నేటి ఇంగ్లిష్ లోకి అనువదించడంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

ఆయన చరిత్రకారుడు. శాసనాల పరిష్కర్త. పురాణ పండితుడు. భాషాభిమాని. భక్తితత్పరుడు. ప్రతిఫలాపేక్ష లేకుండా తుది శ్వాస వరకు తన ప్రతిభను, శక్తి సామర్థ్యాలను చరిత్ర అన్వేషణకు, ఆధ్యాత్మిక సాహిత్య సేవకే వినియోగించారు.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నాటికే తిరుమల ఆలయం వైభవోపేతంగా ఉందన్న శాసనాధారాన్ని వెలికి తీశారు. తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని అనేక పురాణాలు, తెలుగు, తమిళ ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా సాధికారికంగా రూపొందించారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల అనేక ఆలయాల చరిత్రను లిఖించారు. భాండాగారంలోని అన్నమయ్య రాగి రేకులను తొలిసారి వెలికి తీశారు. తనకున్న శాసన భాషా పరిజ్ఞానంతో అన్నమయ్య కీర్తనల భాషను ఎత్తి రాశారు. దాంతో తరువాత పండితులు, సంగీతజ్ఞుల పని సులభమయ్యింది. 1167 రాగి రేకుల సమాచారాన్ని పరిష్కరించడంలో ఆయనది కఠోర శ్రమ. తదేక దీక్ష.

తిరుపతిలో పుట్టి పెరిగిన సుబ్రహ్మణ్య శాస్త్రిది అక్షరాలా పెద్ద యజ్ఞమే. ఒంటరి యుద్ధమే. శాసన భాష తెలియకపోతే మద్రాసు వెళ్లి నేర్చుకున్నారు. తెల్లవారుజామునే భోజనం బాక్స్ పట్టుకుని నడకమార్గంలో మెట్లెక్కి వెళ్లడం, చీకటిపడేలోపు కిందికి దిగి రావడం. శాసనాల మీద అద్దిన నూనె కాగితాలను చూస్తూ రాత్రిళ్ళు చమురుదీపం కింద ఎత్తి రాయడం. మళ్లీ ఉదయాన్నే కొండెక్కడం. సరైన వసతుల్లేవు. సహాయకుల్లేరు. గుర్తింపు లేదు. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నవారు కాదు. కానీ…ఎవరినీ చేయి చాచి అడగలేదు. తన దైన్యాన్ని నోరు విప్పి ఎవరికీ చెప్పుకోలేదు. పీకల్లోతు కష్టాలను భరిస్తూ…తిరుమల, తిరుపతి ఆలయాల సాధికార చరిత్రను రాసిపెట్టారు. అన్నమయ్యను వెలుగులోకి తెచ్చారు. సాధువులను కాపాడ్డానికి దిగివచ్చే దేవదేవుడు ఈ సాధువుకు ఎందుకిన్ని అగ్నిపరీక్షలు పెడుతున్నాడో! అని ఆయన్ను చూసినవారు అనుకున్నారు తప్ప…ఆయన తుదిశ్వాస వరకు దేవదేవుడి శాసన చరిత్ర మహా యజ్ఞాన్ని వదలలేదు. ఇంత నిరాడంబరంగా, ఇంత నిస్వార్థంగా, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా ఇంతటి మహా యజ్ఞం చేసిన సాధు సత్పురుషుడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి తెలుసుకోవడం మన కనీస ధర్మం.

1981లో తుది శ్వాస వదిలిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి సేవలకు గుర్తింపుగా తిరుపతి ఎస్ వీ యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది టీ టీ డి. ఏటా ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ ఆయనను స్మరించుకుంటోంది.
అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-10
“అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ళ”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

