Ghani: ఈమధ్య కాలంలో బాలీవుడ్ భామలంతా టాలీవుడ్ బాట పడుతున్నారు. గతంలోను తెలుగు తెరపై సందడి చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఉన్నారు. కానీ ఈ సారి అంతా కూడా ఒకరి తరువాత ఒకరుగా టాలీవుడ్ కి దిగిపోతున్నారు. అలా ఈ మధ్య కాలంలో కియారా .. అలియా .. శ్రద్ధా కపూర్ పరిచయమయ్యారు. ఆ దారిలోనే సయీ మంజ్రేకర్ ‘గని’ సినిమా ద్వారా పరిచయమైంది. వరుణ్ తేజ్ హీరో గా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచిన ఈ కథలో సయీ మంజ్రేకర్ వరుణ్ సరసన మెరిసింది.
సాధారణంగా తమ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేయాలనీ, గ్లామర్ పరంగా యూత్ కి బాగా కనెక్ట్ కావాలని అందరు హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటివారి జాబితాలో సయీ మంజ్రేకర్ కి తాను ఆశపడిన స్థానం లభించిందా అంటే లేదనే చెప్పాలి. అందుకు కారణం ఈ సినిమాలో ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోవడమే. అసలు ఆమె ఎంట్రీ విషయంలోనే ప్రేక్షకులకు అసంతృప్తి కలుగుతుంది. టైమ్ ఎక్కువగా వేస్టు చేయడకూడదని దర్శకుడు అనుకున్నాడేమో, ‘నేను హీరోను లవ్ చేస్తున్నాను’ అంటూనే ఆమె రంగంలోకి దిగిపోతుంది.
ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్ .. రొమాన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. తెరపై ఆమె హడావిడి తప్ప ఇద్దరి మధ్య ఆడియన్స్ ఊహించుకున్నంత లవ్ కనిపించదు. ఇక రొమాన్స్ కి అందనంత దూరంలో నడిచారు. గ్లామర్ పరంగా సయీకి ఓ మాదిరి మార్కులు పడతాయి. కానీ ఆ గ్లామర్ వైపు నుంచి మాస్ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నమే జరగలేదు. ప్రేమకి సంబంధించిన డైలాగులతోనే ఇద్దరూ సరిపెట్టుకున్నారు. విశ్రాంతి తరువాత ఈ ఇద్దరూ తెరపై కలిసి కనిపించిన సందర్భాలే తక్కువ. అందువలన సయీ తెలుగు నుంచి తాను ఆశించే క్రేజ్ తెచ్చుకోవాలంటే మరో సినిమా వరకూ వేచి ఉండవలసిందేనని చెప్పాలి.