We are ready: ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యను జఠిలం చేయకుండా చర్చలకు వచ్చి సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యలా కలిసి రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ కమిటీని తాము గుర్తించబోమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం సమస్యల్లో ప్రతిష్టంభనను పెంచడమేనని సజ్జల స్పష్టం చేశారు రేపు కూడా తాము చర్చలకు సిద్ధంగానే ఉంటామని, ముందు చర్చలకు వచ్చి వారి అభిప్రాయం చెప్పాలని కోరారు. ప్రభుత్వం- ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగుల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు వారి డిమాండ్లు ఏమిటో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటివరకూ ఏ శాంటిటీతో చర్చలు జరిపారని సజ్జల అడిగారు.
ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు తాము జీతాలు ప్రాసెస్ చేయలేమని చెబుతున్న విషయమై సజ్జలను ప్రశ్నించగా అలాంటప్పుడు సమ్మెకు, నోటీసుకు, చర్చలకు కూడా అర్ధంలేదని వ్యాఖ్యానించారు. ఇలానే వ్యవహరిస్తే ప్రభుత్వం కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం ఉండబోదని అంటూనే అలాంటి పరిస్థితి రాబోదని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున స్వయంగా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలకు ఆహ్వానించారని అలాంటప్పుడు ఇది ప్రభుత్వ కమిటీ కాదని ఎలా చెబుతారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఉద్యోగస్తులు, మేము అంతా ప్రభుత్వంలో భాగమని, అందుకే చర్చలకు రావాలని కోరారు. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు కోవిడ్ మూడో దశ నేపథ్యంలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తయారుగా ఉన్నామని, చర్చలకు రావాలని బొత్స సూచించారు.