రాష్ట్రంలో పేదలు, బడుగు వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడి, ఆర్ధికంగా, సామాజికంగా చైతన్యం కలిగించే దిశలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సమానత్వాన్ని, సమానహక్కులను సాధించి సాధికారతతో అడుగులు ముందుకు వేసే దిశగా జగన్ పునాదులు వేశారని అయన వెల్లడించారు. 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయపతాకాన్ని సజ్జల ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడారు.
స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్ధంలో జాతి పునర్ నిర్మాణం, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం, ప్రణాళికాబద్ధ
అభివృద్ధి, ప్రజాస్వామ్యబధ్దంగా వ్యవహరించడం, నిస్వార్ధపరులైన, జాతికి అంకితమైన నాయకత్వం చూశామని గుర్తు చేశారు. మనరాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం కొత్త శకం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే విధంగా, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పధకాలను వారికి అందించడం జరుగుతూ వస్తోందని వివరించారు.
రాష్ట్రంలో వ్యవస్ధాపరమైన మార్పులు జరుగుతున్నాయని, ఏ పట్టణంలోకి పోయినా, ఏ పల్లెలోకి పోయినా చేసిన కార్యక్రమాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకునే విధంగా ఆ కార్యక్రమాలు ఉన్నాయని సజ్జల అన్నారు.
వచ్చే రెండు సంవత్సరాల వరకు ఎన్నికలు, రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, మౌళిక సదుపాయాలతో కూడిన పాఠశాలలు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు…. వీటన్నింటిని మన ప్రజల ఉమ్మడి ఆస్తులుగా గమనించి వాటిని సంరక్షించుకునే విధంగా చైతన్యవంతంగా వ్యవహరించాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీ శ్రేణులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జగన్ కంటున్న కలలను పూర్తి చేయడం మనదరి బాధ్యత అని కార్యకర్తలకు ఉద్బోదించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేత బొప్పన భవకుమార్, నవరత్నాల అమలు కమిటీ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.