అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మాట వాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసనీ, ఏదో ఒక కేసులో అన్ని వాస్తవాలూ బైటకు వస్తాయని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి అనేది రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన ఒక పెద్ద కుంభకోణమని అయన పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ సలహాదారులపై వస్తున్న విమర్శలను సజ్జల ఖండించారు. తెలుగుదేశం హయాంలో 100 మంది సలహాదారులను నియమించుకున్నారని, మరో 200 మందిని కన్సల్టేన్సీల పేరుతో నియమించుకున్నారని అన్నారు. తాము పార్టీకి సేవచేసి, ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహిస్తున్నామని, తెలుగుదేశం హయాంలో పరకాల ప్రభాకర్ వారి పార్టీ కాకపోయినా సలహాదారుగా నియమించి క్యాబినెట్ సమావేశాల్లో సైతం కూర్చోబెట్టుకున్నారని సజ్జల ఆరోపించారు.
ఈ మధ్య ప్రతిదానికీ రాజీనామాలకు మేం రెడీ, మీరు చేస్తారా అని అడగడం తెలుగుదేశం నాయకులకు అలవాటుగా మారిందని సజ్జల దుయ్యబట్టారు. వారు రాజీనామాలు చేయాలనుకుంటే ఎవరైనా అపారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ఆమోదించుకున్న చరిత్ర తమ పార్టీ ఎంపీలకు ఉందని గుర్తు చేశారు. రాజీనామా చేస్తారా అని అడగడం తప్ప టిడీపీ ఎంపీలు చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు సజ్జల. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతున్నారని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న విశ్వాసం తమకు ఉందన్నారు.
చంద్రబాబు సిఎంగా ఉండగా కేసియార్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుంటే విపక్ష నేత గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేశారని, నేను చేస్తున్న కాబట్టి మీరు కూడా రావాలని అడగలేదే అని సజ్జల తెలుగుదేశం పార్టీని నిలదీశారు.