రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోవాలని తాము కోరుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమర రాజా ఫ్యాక్టరీని తరలించాలని తాము ఎక్కడా చెప్పలేదని, హైకోర్టు అభ్యంతరాలను సరిచేసుకోవాలని మాత్రమే సూచించామని వివరించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమని, అమర రాజా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న లెడ్ రసాయనంతో నీళ్ళు కలుషితమై ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని సజ్జల ప్రశ్నించారు.
రాష్ట్రంలో 114 ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నోటీసులు ఇచ్చారని వాటిలో 50 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని సజ్జల వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి సూచించిన అభ్యంతరాలను సరి చేసుకోవాలని మాత్రమే తాము కోరుతున్నమన్నారు. తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సజ్జల మీడియాతో మాట్లాడారు.