చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తుకోసం వెంపర్లాడాల్సిన అవసరంలేదని, బలహీనంగా ఉన్న టిడిపిని ప్రజల దృష్టిలో బలంగా కనబడేలా చేసేందుకే ఆయన ప్రయత్నాలన్నీ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్ ది అధికారిక పర్యటన అయితే, టిడిపి అధ్యక్షుడిగా బాబుది రాజకీయ పర్యటన అని పేర్కొన్నారు. బాబు నిస్పృహ చూస్తునేనే తెలుగుదేశం ఎంత బలహీనంగా ఉందనేది తెలుస్తోందన్నారు. తాడేపల్లి సిఎం నివాసం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్ళలో తాము ఈ పనులు చేశాము అని చెప్పి ధైర్యంగా తాము ఓట్లు అడుతుతున్నామని… ప్రజల ముందు పరిమితమైన ఆప్షన్ ఉందని, జగన్ పాలన సాగాలా? బాబు పాలన కావాలా? అనేదేనని స్పష్టం చేశారు. గత ఐదేళ్ళ బాబు పరిపాలనను దృష్టిలో పెట్టుకుని, ప్రజలు ఓట్లు వేస్తారని నమ్ముతున్నామన్నారు. బిజెపియే తమతో పొత్తుకోసం వెంటపడుతున్నట్లు కలరింగ్ ఇచ్చారని అన్నారు. వాస్తవానికి పరిస్థితి మరోలా ఉందన్నారు. రాష్ట్రంలో బిజెపి నేతలు టిడిపి అద్దె మైకుల్లా వ్యవహరిస్తున్నారన్నారు.
ఏపీలో అడుగుపెట్టిన నాటినుంచి వైఎస్ షర్మిల కూడా బాబు, పవన్ ల మాదిరిగానే మాట్లాడుతున్నారని, పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదని ఎద్దేవా చేశారు. బాబు నుంచి అందిన స్క్రిప్ట్ నే ఆమె చదువుతున్నట్లు ఉందన్నారు. సి ఓటర్- ఇండియా టుడే సర్వే పై సజ్జల స్పందిస్తూ గతంలో ఆ పార్టీ ఇచ్చిన గత ఎన్నికల్లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా తమకు 11, టిడిపికి 14 ఇచ్చారని… కానీ వచ్చిన సీట్లు తమకు 22 అని దీన్ని బట్టే ఆ సర్వే విశ్వసనీయత ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడమే అనైతికమని, వారికి దాదాపు 20 సీట్ల వరకూ అవసరమవుతాయని అన్ని సీట్లు ఎలా సంపాదిస్తారని, కొనుగోళ్లకు తలుపులు తెరవాలని ఆలోచిస్తారేమో అంటూ సజ్జల అన్నారు.