తనకు రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయంటూ టిడిపి నేత ధూళిపాల నరేంద్ర చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ రోడ్డుకు అవతల ఒక నియోజకవర్గం, ఇవతల మరో అసెంబ్లీ పరిధిలో ఉన్నాయని, ఇది తెలిసిన వెంటనే తాను పొన్నూరులో తొలగించాల్సిందిగా దరఖాస్తు చేశానని వివరించారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు.
“పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా ఒక తెలుగుదేశం నాయకుడు చేసిన ఆరోపణను, ఆపార్టీకి కొమ్మకాస్తున్న వర్గం మీడియా నాతో సహా మా కుటుంబ సభ్యుల ఓట్ల విషయంపై విపరీత పోకడతో ప్రచారం చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. తెలంగాణలో ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లకు దరఖాస్తు చేసుకున్నట్టుగా, దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ, అపార్టీకి మద్దతు ఇచ్చేవారితో కూడిన దొంగల ముఠా మాదిరిగా మేం ఎన్నడూ దిగజారి ప్రవర్తించలేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. తెలంగాణ ఎన్నికల్లో నేనుగాని, నా కుటుంబం కాని ఓట్లు వేయలేదు.
ప్రస్తుతం మేం ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయి. ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగింది. విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేయడం జరిగింది. మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూను నియోజకవర్గ ఓటర్ల జాబితానుంచి మా పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వతేదీనే దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నా. దీనికి సంబంధించి ఆధారాలను కూడా ఈ పత్రికా ప్రకటనకు జతపరుస్తున్నాను. ఈవిషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాం. ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదు. తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే మాపార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి. ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు” అంటూ సజ్జల వివరించారు.