దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారిస్తున్న త్రిసభ్య కమిటీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ను విచారణకు పిలిచింది. సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటి రాష్ట్రంలో పర్యటిస్తోంది. దిశ తల్లిదండ్రులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారిస్తోంది. నేడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుల స్టేట్ మెంట్ రికార్డ్ చేయనుంది. రేపు లేదా ఎల్లుండి విచారణకు హాజరు కావాలని సజ్జన్నార్ కు సూచించింది. ఈ ఎన్ కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. సజ్జన్నార్ ను విచారించిన అనతరం మరోసారి ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ గా వ్యవహరించిన మహేష్ భగవత్ ను కూడా మరోసారి విచారించనుంది.
నవంబర్ 27, 2019న శంషాబాద్ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 6న విచారణలో భాగంగా సీన్ రీ కన స్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్ళిన సమయంలో వారు పోలీసులపై రాళ్ళు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించారు, ఈ సందర్భంగా జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు చనిపోయారు. దీనిపై కొందరు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ లతో త్రిసభ్య కమిటీని నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. సమగ్ర విచారణ అనంతరం రెండు నెలల్లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనుంది.