ప్రభాస్ అభిమానులంతా ‘సలార్’ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయం రానే వచ్చేసింది. ఈ రోజునే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ కి వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించింది. ప్రశాంత్ నీల్ ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో .. ఆయన హీరోను చూపించే తీరు ఎలా ఉంటుందనేది ఆడియన్స్ కి తెలుసు. అందువలన ఆయన మార్కు హీరోయిజంలో ప్రభాస్ ను చూడటానికి వాళ్లంతా ఆసక్తిని చూపిస్తూ వచ్చారు.
ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించగా, జగపతిబాబు .. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా విడుదలైన థియేటర్స్ దగ్గర సందడి మామూలుగా లేదు. ‘రాజమన్నార్’ పాత్రలో జగపతిబాబు .. ఆయన కుమారుడు వరదరాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రను ప్రశాంత్ నీల్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు.
వరద రాజమన్నార్ స్నేహితుడిగా ప్రభాస్ పోషించిన ‘దేవా’ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. వరదరాజమన్నార్ కి సంబంధించిన సమస్య ఏమిటి? ఆ సమస్యలో నుంచి స్నేహితుడిని బయటపడేయడానికి ‘దేవా’ ఏం చేస్తాడు? అనేది తెరపైనే చూడాలని అంటున్నారు. భారీ యాక్షన్ సీన్స్ .. వాటికి కనెక్ట్ అయిన ఎమోషన్స్ ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తాయనే టాక్ థియేటర్ల దగ్గర బలంగానే వినిపిస్తోంది.