Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయువరైతు ఆత్మాభిమానం

యువరైతు ఆత్మాభిమానం

How Dare You: ఇది చిన్న వార్త. కానీ చాలా ఆత్మాభిమానం కల వార్త. కళ్లు నెత్తికెక్కినవారి కళ్లు తెరిపించే వార్త. నాజూకు వేషభాషలను మాత్రమే గౌరవించే అధునాతన సమాజం పోకడను తెలిపే వార్త.

సందర్భం:-
కర్ణాటక గ్రామీణ ప్రాంతంలో రైతు కెంపేగౌడ తన మిత్రులతో కలిసి మహీంద్రా కార్ల షో రూముకు వెళ్లాడు. బొలెరో పికప్ ట్రక్ నచ్చింది. ఎంత? అని అడిగాడు. పదిరూపాయల నోటు మొహమే చూసి ఎరగనట్లున్నావు…నీకు దీని ధరతో పనేమిటి? అని సేల్స్ మ్యాన్ హేళన చేశాడు. ఒరేయ్! నువ్ రేటు చెప్పు…అర గంటలో డబ్బు నీ మొహాన పడేస్తా…అనడంతో మాట మాట పెరిగింది. పదిలక్షలు తీసుకురా! చూద్దాం…అన్నాడు. అంతే…అరగంటలో కెంపే గౌడ పది లక్షల తళ తళలాడే నోట్ల కట్టలు తెచ్చి షో రూమ్ క్యాష్ కౌంటర్లో కుమ్మరించి…ఇప్పుడు బండి ఇస్తావా? చస్తావా? అని కాలర్ పట్టుకుని గొడవ పెట్టుకున్నాడు.

సేల్స్ మ్యాన్ కాళ్ల బేరం:-
గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఆ వాహనానికి వెయిటింగ్ ఎక్కువగా ఉందని, బుక్ చేసుకుంటే వీలయినంత త్వరగా ఇస్తామని సేల్స్ మ్యాన్ కాళ్ల బేరానికి వచ్చాడు. హేళనగా మాట్లాడినందుకు క్షమాపణలు కోరాడు.

కొస విరుపు:-
బోడి నీ బండి…దానికి తొక్కలో వెయిటింగ్…పోబే…నన్ను అవమానించినచోట నేనసలు బండే కొనను పో…గుణపాఠం చెప్పాలనుకున్నా…చెప్పా…అని భుజం మీద తుండు గుడ్డ తీసి…పది లక్షలను అందులో మూట కట్టుకుని…వెళ్ళిపోయాడు. కర్ణాటకతో పాటు జాతీయస్థాయిలో ఈ వార్త వైరల్ అయ్యింది.

ప్రతి చిన్న విషయానికి సామాజిక మాధ్యమాల్లో వెంటనే స్పందించే మహీంద్రా యజమాని ఆనంద్ దీని మీద ఎప్పుడు స్పందిస్తారో?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : ఎన్నికల సిత్రాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్