రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 12 నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీలు తెరుస్తామని, ఆన్ లైన్ తరగతులు కూడా అదేరోజు ప్రారంభిస్తామని తెలిపారు. ఆగస్టు 15లోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారన్నారు.
విద్యాశాఖలో నాడు- నేడుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు…. రాష్ట్రంలోని మిగిలిన పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద చేపట్టాల్సిన పనుల కోసం 16 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ సిద్ధంచేయాలని సిఎం ఆదేశించినట్లు సురేష్ వివరించారు.
ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదు, ఏ ఒక్క ఉపాధ్యాయుడినీ తొలగించబోమని పునరుద్ఘాటించారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ వర్క్ బుక్ క్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని, రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.