Saturday, January 18, 2025
Homeఫీచర్స్బలంగా పోరాడుదాం

బలంగా పోరాడుదాం

చంద్రబాబు తో ఉమ్మడి ప్రెస్ మీట్ అయిపోయాక పార్టీ ఆఫీసుకి చేరుకున్నాడు పవన్ కళ్యాణ్. కారు దిగి భారంగా అడుగులు వేస్తూ లోపలికి నడిచాడు. అతడిని అనుసరించారు పిఏ బాలు, పార్టీ కార్యకర్త శీను, ఇద్దరు బాడీ గార్డ్స్.

పవన్ కళ్యాణ్ నీరసంగా సోఫాలో కూలబడి “అరే బాలూగా, ఐస్ పాక్ తీసుకురా “ అని ఆర్డరేశాడు. బాలు తెచ్చివ్వగానే ఆ ఐస్ పాక్ ని తల మీద పెట్టి అదుముకోసాగాడు.

పవన్ కళ్యాణ్ చిరాకుని గమనిస్తున్న కార్యకర్తకి అసలే నోటి దూల.. ఆపైన పవన్ కళ్యాణ్ తో కాస్త చనువు ఎక్కువ.

“ముష్టి మూడు ఎంపీ సీట్లతో, చచ్చు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లతో మీరు సిఎం ఎక్కడ అవుతారు? అవరు. అవరంతే” నిష్కర్షగా మనసులో మాట కక్కేశాడు శీను.

పవన్ కళ్యాణ్ చూపుల్తోనే కార్యకర్తని భస్మం చేసేలా చూశాడు. తల తిప్పి బాడీ గార్డ్స్ కి సైగ చేశాడు. ఆ సైగలో కర్తవ్యబోధని అవగతం చేసుకున్న అంగ రక్షకులు చటుక్కున శీను రెండు కాళ్ళూ ఏకకాలంలో లాగేసి పైకెత్తి శీర్షాసనం భంగిమలో పట్టుకున్నారు. కుయ్యో మొర్రో అంటూ గగ్గోలు పెట్టేశాడు శీను.

“ నీదగ్గర అయిడియాలేవైనా ఉన్నాయంట్రా “ సీరియస్ గా అడిగాడు పవన్ కళ్యాణ్ శీనూని. శీర్షాసనం భంగిమలోనే వణికిపోతూ తల అడ్డంగా ఆడించాడు శీను.

“ మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కవాళ్ళని క్రిటిసైజ్ చెయ్యకూడదొరేయ్, కాలిపోద్ది” అంటూ సోఫాలోంచి లేచి శీను వైపు నడిచాడు.

“ అరే శీనుగా.. లాస్ట్ టైం మనం పోటీ చేసినప్పుడు మనకెన్ని సీట్లు వచ్చాయిరా ?”

“ఒక్క సీటే వచ్చింది సార్ ” వెనకనించి పిఏ బాలు ఆన్సరిచ్చాడు.

“మరి నేను గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసినప్పుడు ఏం జరిగిందిరా?”

“ రెండు చోట్లా ఓడిపోయార్సార్” వెనక నుంచి బాలు.

శీను ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయభక్తులతో వింటున్నాడు.

“ మరి ఈ టైంలో జగన్ ని ఓడించాలంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి కదా”

“పెట్టుకోవాలి కదా” – బాలు వంతపాట

“మరి పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్లు ఎన్ని సీట్లిస్తే అన్నే సీట్లతోనే సరిపెట్టుకోవాలి కదా”
“..కదా”

“మరి అలాంటప్పుడు పొత్తులో ఉండకుండా ఏం చెయ్యాల్రా?” అన్నాడు పవన్ కళ్యాణ్.

“ లోకంలో ఇంతకంటే ఎవరూ ఏం చెయ్యలేరు సార్, పొత్తులో పార్టనర్ గా ఉండడం తప్ప..” అన్నాడు యజమాని మనసెరిగిన బాలు.

“ ఆ విషయం వాడికి చెప్పుబే” అన్నాడు పవన్ కళ్యాణ్.

“ఎక్స్ట్రార్డినరీ సార్” వణుకుతూ అన్నాడు శీను.

“ నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయ్”

“ ఎట్టా ఉంటాది సార్, ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటాది సార్”

“ఖర్చులకి డబ్బులిచ్చేవాడిమీద జోకులేస్తే కరుసైపోతావ్ జాగ్రత్త..” అని శీనూకి వార్నింగ్ ఇచ్చి, “దింపండి ఆడిని” అని బాడీ గార్డ్స్ కి చెప్పాడు పవన్ కళ్యాణ్.

– మంగు రాజగోపాల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్