Saturday, January 18, 2025
Homeసినిమానానితో శేఖర్ కమ్ముల! 

నానితో శేఖర్ కమ్ముల! 

నాని చేసిన కొన్ని సినిమాలు చూస్తే, ఈ కథను శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ముల తీసిన కొన్ని సినిమాలు చూస్తే, ఈ కథను నానితో చేస్తే కరెక్టుగా ఉండేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ ఎంచుకునే కథలు .. జోనర్లు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండునని అభిమానులు అనుకుంటూ ఉంటారు. అలాంటి అభిమానుల కోసం ఈ ఇద్దరూ త్వరలో ఒక ప్రాజెక్టు చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు జరిగాయని తెలుస్తోంది.

రీసెంటుగా శేఖర్ కమ్ముల నానికి ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హీరో ధనుశ్ తో ‘కుబేర’ సినిమా చేస్తున్నాడు. నాగార్జున కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, షూటింగు దశలో ఉంది. శేఖర్ కమ్ముల పూర్తి ఫోకస్ ను ఈ సినిమాపైనే పెట్టాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాతనే, నాని కథపై ఆయన కసరత్తు చేయనున్నాడని అంటున్నారు. ఈ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, నానిని ఆయన కొత్తగా చూపించనున్నాడని అంటున్నారు. ఏసియన్ సునీల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందనే ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం. అయితే ఇది సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే సమయం ఉంది. వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాని కూడా ఆల్రెడీ ఒప్పుకున్న తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘సరిపోదా శనివారం’పైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఆ తరువాత శైలేశ్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ చేయనున్నాడు. నాని సొంత బ్యానర్లోనే నిర్మితమయ్యే సినిమా ఇది. ఈ సినిమా పూర్తయిన తరువాతనే శేఖర్ కమ్ముల సినిమా గురించి ఆయన ఆలోచన చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో సాయిపల్లవిని తీసుకునే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా ఓ వైపు నుంచి వినిపిస్తూనే ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్