Saturday, January 18, 2025
Homeసినిమాఎక్కువ సంతృప్తిని ఇచ్చిన సినిమా అదే: శేఖర్ కమ్ముల  

ఎక్కువ సంతృప్తిని ఇచ్చిన సినిమా అదే: శేఖర్ కమ్ముల  

శేఖర్ కమ్ముల .. ఫ్యామిలీతో కలిసి ధైర్యంగా చూడగలిగే సినిమాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన కథలలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన సినిమాలలో అనవసరమైన పాత్రలుగానీ .. సన్నివేశాలు గాని కనిపించవు. ఇక కథానాయిక పాత్రలు కేవలం ఆడిపాడటం వరకూ మాత్రమే కాకుండా, అవి బలమైన వ్యక్తిత్వంతో కనిపిస్తాయి. వినోదంతో కూడిన సందేశాలు కూడా అంతర్లీనంగానే వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకుడిగా పాతిక సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. “నా కెరియర్లో చాలావరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలను రెడీ చేసుకోగలిగాననే సంతోషం ఉంది. నేను ఇంతవరకూ చేసిన సినిమాలలో నాకు ఏది ఇష్టమని అడిగితే మాత్రం నేను ‘లీడర్’ పేరే చెబుతాను. అలాగే ఏ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉంది అని అడిగినా ‘లీడర్’ పేరే చెబుతాను. ఆ సినిమా అంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ సీక్వెల్ కి అన్నీ కుదిరితే, మళ్లీ రానాతోనే ఆ సినిమా చేస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు” అని అన్నారు.

“నేను ‘లీడర్’ సినిమా చేసేటప్పటికీ .. ఇప్పటికీ రాజకీయాలు మరింత దిగజారిపోయాయి. అలాంటి పరిస్థితులను తెరకెక్కించేటప్పుడు, మనం అనుకున్న పరిష్కారం కూడా చెప్పవలసి ఉంటుంది. అలా పరిష్కారంతో కూడిన సమస్యను చెప్పడం వల్లనే ప్రయోజనం ఉంటుందని నా ఉద్దేశం. ‘లీడర్’కి సీక్వెల్ చేస్తే అది ఈ తరహాలోనే ఉంటుంది” అని చెప్పారు. శేఖర్ కమ్ముల మాటలు వింటుంటే, ‘లీడర్’కి సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ధనుశ్ సినిమాకి సంబంధించిన పనులతో ఆయన బిజీగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్