ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయన స్థానంలో సమీర్ శర్మను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ముత్యాల రాజు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
వాస్తవానికి జూన్ నేలాఖరుకే ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ముగిసింది. అయితే కోవిడ్ రెండో దశ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అదిత్యనాథ్ ను మూడు నెలలపాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. దీనితో అయన సెప్టెంబర్ ౩౦ వరకూ సిఎస్ గా కొనసాగే అవకాశం ఏర్పడింది.
1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా శాఖ, వనరుల సమీకరణ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా కొనసాగుతున్నారు. కేంద్ర సర్వీసుల్లో కూడా అయన పనిచేశారు. అక్టోబర్ 1 న సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. సమీర్ శర్మ నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు అయన పదవీ కాలాన్ని పోదిగించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.