చరిత్రలో కొందరు పుడతారు…కాలగర్భంలో కలిసిపోతారు. కానీ మరికొందరు పుడతారు.. కాలగతినే మారుస్తారు. 8వ శతాబ్దపు భారతదేశం ఒక చీకటి సముద్రంలా ఉన్న వేళ.. కేరళలోని ‘కాలడి’ అనే ఒక చిన్న గ్రామం నుండి ఒక జ్ఞాన భానుడు ఉదయించాడు. కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే అనంతమైన కాలానికి సరిపడా జ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన ఆ మహా మనీషి, జగద్గురువు ఆది శంకరాచార్యుల జీవిత ప్రస్థానం ఇది.
కాలడి నుంచి కనకధార వరకు…
కాలడి…ఒక సామాన్య గ్రామం. కానీ అక్కడ పుట్టిన బాలుడు అసామాన్యుడు. శివగురు, ఆర్యాంబల తపఃఫలం ఈ శివాంశ సంభూతుడు. ఐదేళ్లకే తండ్రిని కోల్పోయినా తల్లి అనురాగంలో వేదాలను ఔపోసనం పట్టాడు. శంకరుడి జీవితంలో మొదటి అద్భుతం-కనకధారా స్తోత్రం. తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయను భిక్షగా వేసిన ఆ పేద తల్లి దారిద్ర్యాన్ని చూసి చలించిన శంకరుడు ఆ ఇంట్లో స్వర్ణ వర్షం కురిపించాడు. కానీ ఆ బాలుడి కన్ను స్వర్ణం మీద లేదు…సత్యం మీద ఉంది.

సంసారమే మొసలి
ఎనిమిదేళ్లకే వైరాగ్యాన్ని ఎంచుకున్న శంకరుడు నదిలో మొసలి పట్టుకున్న ఘట్టం ద్వారా తన తల్లిని సన్యాసానికి అనుమతి కోరాడు. “నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ కడచూపుకు నేను వస్తాను” అని తల్లికి మాట ఇచ్చి, కట్టుబట్టలతో జ్ఞానాన్వేషణకు బయలుదేరారు. జ్ఞాని అంటే రాయి కాదు, ప్రేమ కలిగిన మహర్షి అని శంకరుడు నిరూపించాడు.
గురువే గమ్యం: నర్మదా తీరంలో ‘చిదానంద రూపం’
ఓంకారేశ్వర్ దగ్గర నర్మదా నది ఒడ్డున గురువు గోవింద భగవత్పాదులను కలిసిన వేళ.. “ఎవరువు నువ్వు?” అన్న ప్రశ్నకు శంకరులు ఇచ్చిన సమాధానమే ‘నిర్వాణ షట్కం’.
“న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః.. చిదానంద రూపః శివోహం శివోహం” అని తనను తాను ఆత్మ స్వరూపంగా పరిచయం చేసుకున్న ఆ బాలుడిలో రేపటి జగద్గురువును దర్శించారు ఆయన గురువు.

కాశీ ఖండం: మనీషా పంచకం
కాశీ వీధుల్లో ఒక చండాలుడు ఎదురైనప్పుడు, “దేనిని దూరం జరగమంటున్నావు? ఈ దేహాన్నా? లేక అందులో ఉన్న ఆత్మనా?” అన్న ప్రశ్నకు శంకరుడు వినమ్రులయ్యాడు. ఆత్మకు కులం లేదు, మతం లేదు అని చాటుతూ ‘మనీషా పంచకం’ రచించాడు. జ్ఞానిలో ఉండాల్సిన మొదటి లక్షణం ‘వినయం’ అని లోకానికి చాటాడు.
దిగ్విజయ యాత్ర: భారతావనిని ఒక్కటి చేసిన 4 పీఠాలు
విడిపోయిన సిద్ధాంతాలను ఏకం చేయడానికి అజ్ఞానంపై యుద్ధం ప్రకటించిన వీరుడిగా శంకరుడు దేశం నలుమూలలా నాలుగు శక్తివంతమైన పీఠాలను స్థాపించాడు.
- దక్షిణాన శృంగేరి: ఋష్యశృంగ పర్వతాలపై శారదా పీఠం.
- తూర్పున పూరి: గోవర్ధన పీఠం.
- పడమర ద్వారక: కాళికా పీఠం.
- ఉత్తరాన బద్రీనాథ్: జ్యోతిర్మఠం.
ఇవి కేవలం భవనాలు కావు…భారతదేశం ఆధ్యాత్మికంగా ముక్కలు కాకుండా కాపాడే నాలుగు ఉక్కు స్తంభాలు. ఆయన స్థాపించిన ‘షణ్మతాలు’ (శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, కౌమార) ఏ దేవుడిని పూజించినా చేరేది ఆ ఒక్క పరమాత్మకే అని నిరూపించాయి.

అక్షర సత్యం – భాషా వైభవం
శంకరుల కలం ఒక మాంత్రికుడి దండం.
- పండితుల కోసం: బ్రహ్మసూత్ర భాష్యాలు
- పామరుల కోసం: భజగోవిందం, సౌందర్యలహరి
ఆయన శ్లోకం ఒక నిరంతర ధ్యానం. తర్కంతో మేధావులను, భక్తితో సామాన్యులను గెలిచిన అద్భుత భాషావేత్త ఆయన.
అంతం కాని ఆరంభం
32 ఏళ్లు.. ఒక ఒక మనిషి జీవితంలో ఇది చాలా చిన్న సమయం. యుగకర్తకు ఇది సరిపోతుంది. కేదార్‌నాథ్ మంచులో శంకరుడు అంతర్ధానమయ్యాడు. కానీ ఆయన నేటికీ మన గుడిలో, మనం చదివే మంత్రంలో, మన ఆత్మలో ఉన్నాడు. ఎప్పటికీ అలాగే ఉంటాడు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

