మధ్య తరగతి జీవితాలు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి. అవసరాలకీ .. అందుకోలేని విలాసాలకు మధ్య మధ్యతరగతి వారి జీవితం నలిగిపోతూనే ఉంటుంది. ఆకర్షణల దిశగా పరుగులు తీయడంలో అలసిపోతూనే ఉంటుంది. అలాంటి మధ్య తరగతి జీవితాలను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడానికి దర్శకుడు కుమారస్వామి చేసిన ప్రయత్నమే ‘షరతులు వర్తిస్తాయి’. చైతన్యరావు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, నిన్ననే విడుదలైంది. ‘షరతులు వర్తిస్తాయి’ అనేది కొన్ని వ్యాపార సంస్థలు సున్నితంగా పెట్టే గట్టి మెలిక. ఈ అంశాన్ని తోడుచేసుకుని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ఈ మధ్య కాలంలో తెలుగు కథలను చాలావరకూ విదేశాల్లోనే పెంచి పెద్ద చేసి ఇక్కడి థియేటర్లకు తీసుకొచ్చి దిగబెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాన్ని తెరపై చూడటమే కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది. తెరపై మధ్య తరగతివారి కష్టాలను ప్రేక్షకులు తీర్చలేకపోయినా, ఇది కూడా మన కథలానే ఉందేనని ఓన్ చేసుకుంటారు. అందువలన దర్శకుడి ప్రయత్నం మంచిదే .. అతను ఎంచుకున్న పాయింట్ సరైనదే. అయితే వచ్చిన చిక్కల్లా ఆ కథను ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోనే.
దర్శకుడి ఆలోచన .. ఉద్దేశం .. ప్రయత్నం మంచిదే అయినా, ఆ కథను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుంచే విషయంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఒక బలమైన అంశం చుట్టూ అంతే బలమైన సన్నివేశాలను అల్లుకోగలిగినప్పుడే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంలో సరైన కసరత్తులు జరగలేదేమోనని అనిపిస్తుంది. చైతన్యరావును ఎంచుకోవడంలో దర్శకుడి నిర్ణయం సరైనదే. కానీ ఆ పాత్రను ఆడియన్స్ ఫాలో అయ్యేలా శ్రద్ధ పెడితే, మరింత బెటర్ అవుట్ ఫుట్ వచ్చేదే.