Sunday, January 19, 2025
HomeTrending NewsYSRTP: తెలంగాణ ఎన్నికలకు దూరంగా షర్మిల పార్టీ

YSRTP: తెలంగాణ ఎన్నికలకు దూరంగా షర్మిల పార్టీ

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు ys షర్మిల  ఈ రోజు(శుక్రవారం) హైదరాబాద్ లో ప్రకటించారు. ప్రజల్లో కెసిఆర్ ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని…ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కాంగ్రెస్ కు  భేషరతుగా మద్దతు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

2021లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తెలంగాణ అంతటా పాదయాత్ర చేశారు. తెలంగాణ కోడలు అని చెప్పుకుంటూ… ప్రజా సమస్యల కోసం పోరాటాలు, ధర్నాలు చేసి జైలుకు కూడా వెళ్ళారు. ఎన్నికలు దగ్గర పడ్డాక… కాంగ్రెస్ అగ్రనేతలను కలిసినప్పటి నుంచి షర్మిల గ్రాప్ పడిపోవటం మొదలైంది.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశం తర్వాత షర్మిలకు ఉన్నత పదవి లబిస్తుందని ప్రచారం జరిగింది. YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా సిద్దం అయ్యారు. ఆమె వస్తే పార్టీకి నష్టమని రేవంత్ రెడ్డి వర్గం అధిష్టానానికి ఏకరువు పెట్టింది. 2018లో టిడిపితో పొత్తు ద్వారా నష్టపోయామని, షర్మిల వస్తే అదే జరుగుతుందని ఢిల్లీ నాయకత్వానికి వివరించారు. దీంతో విలీనం ఆగిపోయిందని సమాచారం.

సిఎం కెసిఆర్ ప్రోద్భలంతోనే తెలంగాణకు షర్మిల వచ్చారని.. పార్టీ స్థాపించిన కొత్తలో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కెసిఆర్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు ఆరోపించారు.

షర్మిల ప్రభావం ఖమ్మంలో కొంత ఉంది. ys రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఖమ్మం, నల్గొండ ప్రజలు ఆదరించారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. తానూ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అటు వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు విఫలం కావటం కూడా ఓ కారణమని స్పష్టం అవుతోంది.

కొద్ది రోజులు క్రితం పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశానికి 40 మందిని సమీకరించడం కష్టంగా మారిందట. దీంతో పార్టీ పరిస్థితి ఏమిటని సమావేశానికి వచ్చిన నేతలు అనుమానం వ్యక్తం చేశారని వినికిడి. పోటీ చేసేందుకు అభ్యర్థుల కరువు, కొంతమంది నేతలు పోటీకి సిద్ధంగా ఉన్నా, పార్టీ తరపున ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే పరిస్థితి లేకపోవడం కారణాలతో వెనక్కి తగ్గుతున్నారు.

తెలంగాణలో పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం,  ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య అన్నట్టుగా నెలకొంది. ఈ తరుణంలో షర్మిల పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టమని హస్తం నేతలు ఆమెను సముదాయించారని సమాచారం. ఎన్నికలు పూర్తి కాగానే కాంగ్రెస్ లో చేర్చుకొని…సముచిత స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి.

షర్మిల నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు నిరసిస్తున్నాయి. పాదయాత్రకు కోట్ల రూపాయలు ఖర్చుచేశామని ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలతో కలిసి షర్మిల ఒక దొంగల ముఠాగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్