Sunday, September 8, 2024
HomeTrending Newsఆ రెండు పార్టీలూ బిజెపి తొత్తులే: షర్మిల విమర్శలు

ఆ రెండు పార్టీలూ బిజెపి తొత్తులే: షర్మిల విమర్శలు

పదేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాయని కానీ భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి మాత్రం కనిపించడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో పదేళ్లుగా కనీసం పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన సభలో ఆమె టిడిపి, వైసీపీలపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని, కానీ రైతుల పెట్టుబడి మాత్రం పెరిగిందని ఎద్దేవా చేశారు.

టిడిపి, వైసీపీలు రెండూ బిజెపికి తొత్తులుగా మారాయని, ఆ పార్టీ ఎంపీలు 25 మంది బిజెపి ఏం చెబితే దానికే తలూపుతున్నారని, అలాంటప్పుడు ప్రజలు ఈ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని, బిజెపి పార్టీ తరఫునే నేరుగా పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలూ ప్రజల వద్ద మాత్రం తాము బిజెపికి వ్యతిరేకం అని చెబుతున్నారని, కానీ వారు బిజెపితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులోనే ఉన్నాయని దుయ్యబట్టారు. వారిద్దరూ బిజెపి జెండాతోనే వస్తే ప్రజలకు ఓ స్పష్టత ఉంటుందన్నారు.

మనకు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా లాంటివి ఇస్తే అప్పుడు బిజెపికి మద్దతు ఇస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదని, కానీ ఏమీ చేయకుండానే వీరిద్దరూ ఎందుకు వారితో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ లో వందలాది మంది క్రైస్తవులను చంపుతున్నా ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గానీ, టిడిపికి గానీ ఓటు వేస్తె అది బిజెపికే వేసినట్లని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాజధాని కూడా లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఒక్క చోట కూడా మెట్రో లేదని, రాష్ట్రంలో రోడ్లు వేయడానికి… కనీసం ఉద్యోగస్తులకు ఒకటోతారీఖున జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూ విమర్శలు గుప్పించారు. స్వలాభం కోసం ఏపీ హక్కులను వైసీపీ తాకట్టు పెట్టిందని, 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పోరాటం కూడా చేయలేదని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్