My aim to encourage…. ‘కళ్ళు’ సినిమాతో వెండితెరకు పరిచయమై, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన సీనియర్ నటుడు శివాజీరాజా. అలాగే జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన ‘అమృతం’ ధారావాహిక, కొన్ని ఎపిసోడ్లలో అమృతం పాత్రను పోషించి మెప్పించారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజిరాజా ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఫిబ్రవరి 26న శివాజీ రాజా జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో…
సినిమా రంగంలోకి నేను ఎంట్రీ ఇచ్చి దాదాపు 37 సంవత్సరాలు అయింది. నేను మద్రాసులో కెరీర్ మొదలెట్టాను. 1985 ఫిబ్రవరి 24తో చెన్నైలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. చాలామంది సినిమా వాళ్లతో నాకు దగ్గరి అనుబంధం ఉంది. నా అసలు పేరు శివాజీ రాజు కానీ ఒకరోజు ఏచూరి గారు అడిగి.. శివాజీ రాజు ఏమిటి రాజా అని పెట్టు అని చెప్పగా.. ప్రెస్ లో నాపేరు శివాజీ రాజాగా మారిపోయింది. సో.. నా పేరు మార్చింది మీడియా వాళ్ళే. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు. వట్టిచేతులతో వచ్చాను. మనం ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది అదే నా ఫిలాసపీ.
మొన్న పునీత్ చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి. అంతకంటే మంచితనం ఇంకా ఏముంది. ఇక నటుడిగా నేను దాదాపు 500 సినిమాలకు పైగా నటించాను. నటుడిగా భిన్నమైన సినిమాలు, పాత్రలు చేశాను. మొన్న కరోనా వచ్చినప్పుడు నా శక్తికి మించి నిత్యావసర వస్తువులు చాలా మందికి సరఫరా చేశాము. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడా దక్కలేదు. నేను మా అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా చేశాను. అలాగే అంతకు ముందు అన్నిశాఖల్లో పనిచేశాను. నేను పనిచేసినప్పుడు పింఛన్ వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని ఐదువేలు అందేలా చేశాను. నేను మరోసారి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటే ఓల్డేజ్ హోమ్ కట్టాలన్న ఆలోచన ఉండేది కానీ దానిపై నీళ్లుచల్లారు. నేను చిరంజీవి గారితో కలిసి పదిమంది స్టార్స్ ని తీసుకెళ్లి డల్లాస్ లో షో చేసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. చిరంజీవి గారిని విదేశాలకు తీసుకెళ్లి ఆయనను మళ్ళీ జాగ్రత్తగా హైదరాబాద్ పంపించాకే రిలాక్స్ అయ్యాను.
నేను ఏ కార్యక్రమం చేసిన అంత బాధ్యతగా చేశాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించాను. చాలామంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందించడం చాలా తృప్తి ఇచ్చింది. అరవై ఏళ్ళు వచ్చిన సందర్బంగా శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్ పేరిట పేద కళాకారులకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొగిలయ్య లాంటి కళాకారుల ప్రతిభ గుర్తించి సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు మారతాయి. మొగిలయ్యకు దక్కిన గౌరవానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ఆయనను గుర్తించి అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్. ఇలాంటి కళాకారులూ మరింత మంది వెలుగులోకి వస్తే బాగుంటుంది. అందుకే మన రెండు తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి చాలా మంది పేద కళాకారులు ఉన్నారు. వారిని నేను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను
ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేక కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈ మద్యే అందరికి కరోనా వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యపరంగా బాగున్నాను. ఇప్పుడు తెలుగు సినిమా గొప్పగా ముందుకు సాగుతుంది. నేను మొదటినుండి చిరంజీవి గారి అభిమానినే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. ఎందుకంటే.. వాళ్ళు ఎంచుకుంటున్న కథలు, నటన నిజంగా గొప్ప నటులు అని చెప్పాలి. ఈ మధ్య ‘పుష్ప’లో అల్లు అర్జున్ ని చూస్తుంటే ఒకప్పుడు అమీర్ ఖాన్ ని చూసినట్టు ఉంది. పెద్ద హీరో అవుతారు. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను కానీ ఏ సినిమా నాకు సక్సెస్ రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్, ఇలాంటి పాత్రల్లోనే ప్రేక్షకులు ఆదరించారు. కృష్ణవంశీ ఇచ్చిన పాత్రలు నాకు ఏ రేంజ్ పేరు తెచ్చాయో అందరికి తెలుసు. అలాగే నా రాజా ప్రొడక్షన్ బ్యానర్ పై తీసిన సినిమాలు, సీరియల్స్ కూడా మంచి పేరొచ్చాయి. ముఖ్యంగా నేను చేసిన సీరియల్స్ అన్నింటికీ నంది అవార్డులు వచ్చాయి.
ప్రస్తుతం నా సొంత బ్యానర్ లో ‘కళ్ళు’ సినిమాను రీమేక్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను మా అబ్బాయితో. వాడేమో నాకు టైం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇంతవరకు నేను జర్నీ చేసిన ఈ టైం లో నేను ఈ పాత్ర చేయలేదు అన్న ఆలోచన లేదు. నేను భీమవరం నుండి వచ్చినప్పుడు ఎలాగైనా సరే తెరపై కనిపించాలి అన్న ఆలోచనతో వచ్చాను. మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ని నేను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు చేశాను. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాం.. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని ఉంది. మనసుకు నచ్చే, అందరికీ గుర్తుండే పాత్రలు పోషించాలి అనుకుంటున్నాను అంటూ విశేషాలు వివరించారు.
Also Read : ఆడవాళ్ళంతా చూడాల్సిన చిత్రం ఇది : ఖుష్భూ