Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిధ్ శ్రీరామ్ సమర్పిత ఇనుప గుగ్గిళ్లు

సిధ్ శ్రీరామ్ సమర్పిత ఇనుప గుగ్గిళ్లు

Sid Sriram : ఘంటసాల తరువాత ఎవరు అనుకుంటే బాలసుబ్రహ్మణ్యం దొరికాడు. దక్షిణాది పాటల రాజ్యాన్ని ఏలాడు.

బాలు తరువాత ఎవరు అంటే…ఇప్పటికయితే శూన్యం.

ఇప్పుడు తెలుగును తెలుగులా పలకకపోవడం, తెలుగు పాటలను తెలుగువారిచేత పాడించకపోవడం తెలుగు సినిమా పరిశ్రమ విధి విధానాల్లో ఒకటి కావచ్చు. ఈ మధ్య తెలుగులో ఏ పాట విన్నా సిధ్ శ్రీరామే పాడుతున్నట్లు అనిపిస్తోంది. సాయంత్రం పూట గుళ్లో చమురు దీపాలు వెలిగించి మండపం రాతి అరుగులమీద చక్కగా కర్ణాటక సంగీతంలో ఆలాపన ఆరోహణ అవరోహణ గమకాలు స్వరజతులతో తొడమీద తాళాన్ని చరుస్తూ పాడినట్లు అన్ని సినిమా పాటలను సిధ్ శ్రీరామ్ ఒకేలా పాడుతున్నా…ఆదరించే ప్రేక్షకుల ఔదార్యం గొప్పది. సినిమాలో వైవిధ్యానికి ఒక పాట కాకుండా అన్ని పాటలను అతనిచేతే పాడిస్తున్న దర్శక నిర్మాతల హృదయ వైశాల్యం ఇంకా గొప్పది.

తమిళ మూలాలుండి అమెరికాలో పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో అనితరసాధ్యంగా రాణించినంతవరకు సిధ్ శ్రీరామ్ ను ఎవరయినా అభినందించాల్సిందే. అయితే అతనికి తెలుగు తెలియదు. తెలుగు చదవడం, రాయడం రాదు. రావాలని మనం కోరుకోకూడదు. తెలుగును ఇంగ్లీషు లిపిలో రాసుకుని తెలుగు పాటలను పాడుతున్నందుకు కూడా అతడిని అభినందించవచ్చు.

సిధ్ శ్రీరామ్ పాడే పాటలకు గేయ రచయితలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు…తెలుగువారు బతికిపోతారు.

ఉంటే
కంటే
మంటి
పంటి
ఒంటి…లాంటి సున్నా తరువాత ట, టి, టే అక్షరాలు వచ్చే పదాలు దయచేసి రాయకండి. రాస్తే వాటిని అతను…
ఉల్టే
కల్టే
మల్టి
పల్టి
ఒల్టి…అని స్పష్టంగా పాడుతున్నాడు.

అలాగే…
చేసుకుందాం
చూసుకుందాం
కొట్టుకుందాం
దాక్కుందాం…లాంటి కు సున్నా తరువాత దా వచ్చే మాటలను కూడా దయచేసి రాయకండి. వాటిని అతను…

చేసుకుల్దాం
చూసుకుల్దాం
కొట్టుకుల్దాం
దాక్కుల్దాం...అని పరవశించి పాడుతున్నాడు.

తెలుగు దర్శక నిర్మాతలకు రచయితలకు నటులకు ఎవరికీ ఇందులో తప్పు కనిపించలేదు. ఒక్కోపాటను కొన్ని కోట్ల మంది కళ్ళావి కళ్ళావి అని కళ్ళాపి చల్లుకుంటూ కూరలావి కురులావి అని ఏదో తెలియని పైశాచి భాషలా అనుకుని పాడేసుకుంటున్నారు.

చంద్రబోస్, రామజోగయ్య, అనంత్ శ్రీరామ్ తో పాటు ఏ రచయిత అయినా …
సిధ్ శ్రీరామ్ కు…
ఉంటే
కుందాం
అన్న మాటలను
ఇంగ్లీషులో
Unte(not ulte)
Kundam(not kuldam)
అని రాసి చూపించి…వాటిని ఎలా పలకాలో కూడా చెప్పాల్సిందిగా భాషాభిమానులుగా మా అభ్యర్థన.

రాసిన రచయితలుగా మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే…రావి శాస్త్రికి ఏకలవ్య శిష్యుడినని బహిరంగంగా, గర్వంగా చెప్పుకున్న భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, తెలుగు భాషాభిమాని జస్టిస్ ఎన్ వి రమణ ముందు ఈ పంచాయతీ పెట్టాల్సి ఉంటుంది.

గాడిదలో గాకు…
అడిగా అడిగా పాటలో గాకు తేడా లేనప్పుడు తెలుగు భాషాభిమానులుగా మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?
గుర్రం గాడిద ఒకటి కాదని ఎవరు చెప్పాలి మీకు?

అతను భాష తెలియక పాడితే పాడవచ్చు గాక. భాష తెలిసి…సరిదిద్దాల్సిన మీకు బాధ్యత లేదా?

ఈ ఉల్టా పల్టా విల్టే గుల్డె చెరువై చెవికోసుకుల్దాం చెమటలు పట్టించుకుల్దాం మల్డే మళ్టలు ఎన్నాళ్లు?

రామపాదం సోకి అహల్యకు మోక్షం సిద్ధించింది.
సిధ్ శ్రీరామ్ గానం సోకి మనకు ఇనుప గుగ్గిళ్లు సిద్ధిస్తున్నాయి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

తెలుగు పాటల తిక్క

RELATED ARTICLES

Most Popular

న్యూస్