చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 11న మూవీని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట్ లతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ఈ రెండు చిత్రాలను చిరు తన పుట్టినరోజైన ఆగష్టు 22న అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. కళ్యాణ్ కృష్ణతో చేయనున్న మూవీలో చిరుతో పాటు సిద్దు జొన్నలగడ్డ కూడా నటించనున్నారని.. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నటించనున్నారని ప్రచారం జరిగింది. చిరుకు జంటగా త్రిష, సిద్దుకు జంటగా శ్రీలీల అంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం సిద్దూ ఏకంగా 4 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సిద్దు తప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది. అంతా సెట్ అయింది అనుకుంటే ఇప్పుడు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే.. సిద్ధు.. ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించడం లేదట.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రచారంలోకి వచ్చింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. సిద్ధు స్థానంలో మరో హీరో కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారట. పలువురు యంగ్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇప్పుడు సిద్ధు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చిరంజీవి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.