తెలుగులో నానీ తరహాలోనే తమిళంలో శివకార్తికేయన్ ఎంట్రీ ఇవ్వడం కనిపిస్తుంది. నాని మాదిరిగానే ఒక్కో సినిమాను చేస్తూ శివకార్తికేయన్ అక్కడ కుదురుకున్నాడు .. స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆల్రెడీ 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు. అలాంటి శివ కార్తికేయన్ నుంచి ఇటీవల ‘అయలాన్’ సినిమా వచ్చింది. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన కోలీవుడ్ లో భారీస్థాయిలో విడుదలైంది. గ్రహాంతరవాసితో కలిసి హీరో చేసే జర్నీనే ఈ కథ.
ఇదే రోజున ధనుశ్ హీరోగా ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా థియేటర్లకు వచ్చింది. దాంతో ‘అయలాన్’కి గట్టిపోటీ ఏర్పడింది. విడుదలకు ముందు ‘అయలాన్’పై పెద్దగా అంచనాలు కూడా లేవు. అలా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. కోలీవుడ్ లో ఇప్పుడు అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 75 కోట్ల మార్కును దాటేసింది .. 100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది.
అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. రేపు ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ ముందుకు రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అని చెబుతునున్నారు. ఇక ఇదే రోజున ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కూడా ఇక్కడ విడుదలవుతోంది. మరి ఏ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది చూడాలి.