Sunday, January 19, 2025
HomeTrending NewsBuggana: చేనేతలో నైపుణ్యాభివృద్ధి: బుగ్గన

Buggana: చేనేతలో నైపుణ్యాభివృద్ధి: బుగ్గన

ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర పరిశ్రమలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం  దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో  పర్యటిస్తోంది.  దీనిలో  భాగంగా ‘కొరియన్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌’ను సందర్శించారు.  టెక్స్‌టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి , శిక్షణకు గల అవకాశాలపై సంబంధిత సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. అనంతరం దక్షిణ కొరియాలోని డేగు ప్రాంతంలో ఉన్న యెంగ్నామ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి సింథటిక్ టెక్స్‌టైల్స్ పరిశోధన కేంద్రం సహా, కెమికల్ ఇంజినీరింగ్ ల్యాబ్ ను పరిశీలించారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కొరియాలో అనుసరిస్తున్న వినూత్న మార్గాలపై బుగ్గన ఆరా తీశారు.

ఏపీలో చేనేత రంగంపై వేలాది మంది నేతన్నలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో సరికొత్త  విధానాలను అమలు చేయడం , విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించే అవకాశాలపై యూనివర్శిటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా మంత్రి చర్చించారు. ఆ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థులతో మంత్రి బుగ్గన మాట్లాడారు. ఆ తర్వాత ‘కొరియా టెక్స్ టైల్ మెషినరీ కన్వర్జెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ని  కూడా సందర్శించారు. అక్కడ అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను  అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు సియోల్ లోని ‘కియా మోటార్స్ కార్పొరేషన్’లో  ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈవో హో సంగ్ సాంగ్ తో బుగ్గన  సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ విస్తరణ సహా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మానుఫాక్చరింగ్ రంగాల్లో మరింత భాగస్వామ్యంపై చర్చించారు.మంత్రి బుగ్గనకు కియా మోటార్స్ గ్లోబల్ సంస్థ సాదర స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్