Sunday, September 8, 2024
HomeTrending Newsవైసిపి సామాజిక సమతౌల్యం...ఆందోళనలో విపక్షాలు

వైసిపి సామాజిక సమతౌల్యం…ఆందోళనలో విపక్షాలు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసిపి తరపున ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు.

విపక్ష జనసేన – టిడిపిల  మధ్య పొత్తు ఉందని ప్రకటించి నెలలు గడుస్తున్నా సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావటం లేదు. పొత్తులతో సంబంధం లేకుండా రెండు పార్టీలు పోటా పోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అరకు, మండపేట టిడిపి ప్రకటించగా, అందుకు పోటీగా రాజోలు, రాజానగరం రెండు స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది.

రాష్ట్రావతరణ జరిగినప్పటినుంచి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే బడుగు బలహీన వర్గాలు, SC, ST లు కేంద్రంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి అమలు చేస్తున్నారు. సచివాలయాల ద్వారా వాటిని లబ్దిదారులకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు.

కేవలం సంక్షేమ కార్యక్రమాలతో సరిపెట్టకుండా ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు కీలకమైన మంత్రి పదవులను వెనుకబడిన వర్గాలకు అప్పగించారు. మహిళలకు మంత్రి వర్గంలో సిఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీటికి కొనసాగింపుగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక శాతం BC, SC,ST వర్గాలకు ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు.

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం జగన్ చేస్తున్నారు. ఈ దఫా సామాజిక సమతౌల్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని సామాజికవర్గాలకు శాసనసభలో ప్రాతినిధ్యం దక్కేలా టికెట్లు కేటాయిస్తున్నారు.

మైలవరం, మంగళగిరి, రాజమండ్రి రూరల్ తదితర నియోజకవర్గాల్లో బిసిలకు టికెట్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు. గుంటూరు తూర్పు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో మైనారిటీలకు పట్టం కట్టారు. పోలవరం – తెల్లం బాగ్యలక్ష్మి, పిఠాపురం-వంగ గీత, పెనుకొండ- ఉషశ్రీ చరణ్ తదితర స్థానాల్లో మహిళలకు టికెట్లు ఇచ్చారు.

జగన్ టికెట్ల పంపిణీతో విపక్షంలో ఆందోళన నెలకొంది. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైసిపిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చంద్రబాబు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్ళు బిసిలకు రాజకీయాలు నేర్పించిందే టిడిపి అన్నట్టుగా బాబు ప్రసంగాలు ఉండేవి. ఇప్పుడు టికెట్ల పంపిణీలు ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో సామాజిక వెనుకబాటుతనంపై ఆవేదన వెళ్లగక్కుతారని టికెట్ల పంపిణీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో త్వరలోనే తెలనుందని బిసి సంఘాలు వేచి చూస్తున్నాయి. జనసేన నుంచి బడుగులకు ఇవ్వాలని చూసినా చంద్రబాబు అడ్డుపుల్ల వేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన ఇప్పటికే మొదలైంది. మరో నెలరోజుల్లోపు కుల గణన వివరాలు బయటకు రానున్నాయి. దీంతో ఏపి రాజకీయాల్లో ఉహించని మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  జనాభా ప్రాతిపదికన కాకుండా రెండు, మూడు కులాలే రాష్ట్రంలో రాజకీయాలు శాసిస్తున్నాయి. ఒక శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాల నేతలు ప్రజాప్రతినిధులుగా దశాబ్దాలుగా గెలుస్తున్నారు.

రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తాయని రాజనీతిజ్ఞుల అంచనా. వైసిపి బాటలోనే టిడిపి, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకు విరుద్దంగా వెళితే రాజకీయంగా నష్టపోతామని బాబుకు సన్నిహితులు సలహా ఇస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్