ఐ యామ్ ఎ ట్రోల్ అనే పుస్తకం గురించి తెలుసా?
జర్నలిస్టు స్వాతి చతుర్వేది రాసిన పుస్తకం ఇది.
జర్నలిజం- ట్రోల్ ముఠాలు అనే సదస్సు గురించి విన్నారా?
జర్నలిస్టు తులసిపై జరిగిన, జరుగుతున్న ట్రోల్ దాడుల గురించి హైదరాబాద్ లో జరిగిన సదస్సు అది.
వాళ్ళు రాయగలరు.
మాట్లాడగలరు.
సమాజంలో తమ బాధ ఇదీ అని చెప్పుకోగల జర్నలిస్టులు వాళ్ళు.
కనుక, మాటల్లోనో, పుస్తకాల్లోనో బాధను పంచుకుంటారు.
కష్టాలను వెళ్లబోసుకుంటారు.
కనీసం కొందరి నుంచైనా సంఘీభావాన్నో,
సానుభూతినో పొందగలుగుతారు.
నలుగురితో సమస్య చెప్పుకోవడం,
ఈ యుద్ధంలో తాము ఒంటరి కామని సర్దిచెప్పుకోవడం
కొంతైనా స్వాంతన ఇస్తాయి.
కానీ, ఇవేమీలేకుండా, ఇవేమీ తెలియకుండా ..
తమ బతుకేదో తాము బతికేసే సాధారణ ప్రజలు ఇలాంటి దాడిని ఎలా తట్టుకోగలరు.?
యాజమాన్యాల లాలూచీలు,
పాలసీల పేచీలు..
ఆర్ధిక అవసరాలు..
కారణాలేవైతేనేం..
సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా తన స్వాతంత్రాన్ని కోల్పోయింది.
అందుకే ఇప్పుడు ప్రత్యేకించి స్వతంత్ర మీడియా అంటూ సోషల్ మీడియా రెక్కలు విప్పుకుంది.
అయితే, ఇది ఎంత విస్తృతమో అంత విశృంఖలం కూడా..
ఎంత స్వతంత్ర అభిప్రాయాలుంటాయో,
అంతే విషప్రచారం కూడా వుంటుంది.
సోషల్ మీడియా కత్తికి వున్న ఈ రెండో అంచుతోనే అసలు సమస్య.
ఇక్కడ అభిప్రాయాన్ని అభిప్రాయంతో ఏదుర్కోరు.
కిరాయి మూకల దూషణలతో విరుచుకుపడతారు.
అసలు అభిప్రాయాలే లేని ఈ మూకలకి పదో పరకో డబ్బు ముట్టచెప్తేచాలు ..
ఎంతటి విషాన్నైనా కక్కుతారు.
ఎంతటి అరాచకాన్నైనా సృష్టిస్తారు.
చివరికి మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు.
కొన్ని సార్లు ఆ మనుషులని చంపినా పరవాలేదనే అభిప్రాయాన్ని సమాజంలో సృష్టిస్తారు.
మరికొన్ని సార్లు బాధితులు తమ ప్రాణాల్ని తామే తీసుకునేంతగా వేధిస్తారు.
ధబోల్కర్, కలబుర్గి, గౌరీ లంకేష్ లాంటి రచయితలు , ఉద్యమకారులపై ఇలాంటి విషప్రచారమే జరిగింది.
చివరికి వారి హత్యలను కూడాఈ ట్రోల్ ముఠాలు సమర్ధించాయి.
అంతగా ఎదిరించలేని సున్నిత మనస్కులైతే ప్రాణాలు తీసుకునే దాకా ఈ ముఠాలు వదలవు.
ట్రోల్ ముఠాలకి తమకంటూ పెద్దగా అభిప్రాయాలేం వుండవు.
కిరాయి హంతకులకు ఎలా అయితే, వ్యక్తిగత ప్రేమలు, కక్షలూ వుండవో ఈ ట్రోల్ ముఠాలకు కూడా అంతే. పదో పరకో పడేస్తే ఎవరి మీదైనా ఎంతకైనా దిగజారతారు. అడ్రస్ లు లేని చోట, నకిలీ ముఖాలు, ఐడెంటిటీలతో నైరూప్యంగా వుండే ఈ కిరాయి ముఠాలకు సామాజిక మాధ్యమాలే కార్యస్థలం.
ఈ వేదికల మీద చేసే అనాగరిక చర్యలకే ట్రోలింగ్ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. అదేపనిగా ఒక వ్యక్తిని పని కట్టుకుని మాటలతో, లేని పోని అపవాదుల్తో తిట్లతో విరుచుకుపడే ఈ ముఠాల అకృత్యాలకు ఎంత మంది బలవుతున్నారో లెక్కే లేదు. చట్టం, న్యాయం, ప్రభుత్వం ఏమీ చేయలేవన్న ధీమానే ఈ ట్రోల్ ముఠాల బలం.
ఇలాంటి ట్రోలర్ల ముఠాల వికృత చర్యలకి బలైపోయిన తాజా ఉదంతమే గీతాంజలి. కేవలం ప్రభుత్వం వల్ల తనకి వ్యక్తిగతంగా చేకూరిన లాభాన్ని సంతోషంగా పంచుకుందనే ఒకే ఒక కారణంతో ఈ ట్రోల్ ముఠాలు ఆమెని వెంటాడి, వేటాడి చివరికి ప్రాణాలు తీసుకునే దాకా వేధించాయి. ఇప్పుడైనా ఈ ముఠాలని శిక్షించే శక్తి ఈ చట్టాలకు వుందో లేదో.. రానున్న రోజుల్లో తేలుతుంది.
-శివ