Monday, June 15, 2026
HomeTrending Newsఆడబిడ్డల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం: బాబు

ఆడబిడ్డల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం: బాబు

ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు కలలకు రెక్కలు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. విద్యార్ధినులు ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకుగాను వడ్డీలేని రుణాలు అందించేందుకు ఈ పథకాన్ని తీసుకు వస్తామని వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా బాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రకటించగా… నేడు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను బాబు లాంఛనంగా ప్రారంభించారు.  ప్రొఫెషనల్ కోర్సులకు వడ్డీ లేని రుణాలు అందిస్తారని, వడ్డీని లబ్దిదారుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని బాబు వివరించారు.  ప్రపంచంలో ఎన్నో రంగాల్లో బ్రహ్మండమైన అవకాశాలు ఉన్నాయని, మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇది ఎంతగానో దోహదం చేస్తుందని బాబు చెప్పారు.

మహిళాశక్తి పేరిట ఇప్పటికే మహిళలకు నాలుగు పథకాలు ప్రకటించామని…

  • ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా 1500 రూపాయల చొప్పున ఐదేళ్ళలో ఏటా 18 వేల చొప్పున ఐదేళ్ళలో 90 వేల రూపాయలు అందించడం..
  • తల్లికి వందనం కార్యక్రమం కింద.. చదువుకుంటున్న పిల్లల తల్లులకు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికీ  ఏటా 15వేల  రూపాయల చొప్పున  అందజేస్తామని
  • ప్రతి ఇంటికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా  ఇస్తామని
  • ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి నాలుగు ఉన్నాయని.. ఐదో పథకంగా ‘కలలకు రెక్కలు’ ఉంటుందని చెప్పారు.

మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్ప్పుడూ చిత్తశుద్ధితో కృషి చేస్తూ వస్తోందని…. సరైన సహకారం అందిస్తే వారు పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తారని.. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బాబు భరోసా ఇచ్చారు.

గతంలో ఐటిని ప్రోత్సహించడంతో ఎంతో మంది యువతులు ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించారని… దీని వల్లే టిడిపి ఓటు బ్యాంకు కూడా గ్రామాల్లో తగ్గిపోయిందని తమ పార్టీ నేతలు అప్పుడప్పుడు అంటుంటారని… కానీ పార్టీ నష్టపోయినా రాష్ట్రం, ఆయా కుటుంబాలు బాగుపడ్డాయని బాబు వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular