Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాళిదాసు కవిత్వానికి మన పైత్యం తోడు

కాళిదాసు కవిత్వానికి మన పైత్యం తోడు

Creative Liberty: కాళిదాసు కవిత్వానికి మనపైత్యం తోడు… ఉన్నది గొప్పదై , దాన్ని మనం చెడిపేస్తే – ఆ సందర్భంలో వాడే సామెతగా ఈ మాట లోకంలో బాగా ప్రచారంలో ఉంది . వాక్కు అర్థాలను జగత్తుకు తల్లిదండ్రులుగా ప్రతిపాదించి లోకానికి కొత్త చూపును ప్రసాదించిన అంతటి కాళిదాసు – పొట్టి చేతులవాడిని , చాలా ఎత్తయినచెట్టు ఫలాలు ఆశిస్తున్నానని ఎంతో వినయంగా చెప్పుకున్నాడు . కాళిదాసు కవిత్వంలో తప్పులు వెతకలేం – మనకవిత్వంలో ఒప్పులు వెతకలేం అన్న మాట కూడా వాడుకలో ఉంది.

అన్నమయ్య రాగిరేకులను పరిష్కరించి, రాగాలు కట్టి, వ్యాఖ్యలు రాసి, ప్రచారం కల్పించినవారు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ,  గౌరిపెద్ది రామసుబ్బశర్మ, రాఘవన్,  వేటూరి ప్రభాకర శాస్త్రి లాంటివారు… నేదునూరి, నూకల, పినాకపాణి, గరిమెళ్లలాంటివారు జీవితమంతా ధారపోసి మనం ఇప్పుడు పాపులర్ గా వింటున్న కీర్తనలకు ప్రాణం పోశారు.

త్యాగయ్య శిష్య ప్రశిష్య పరంపర కొనసాగింది కాబట్టి కొంతవరకు ఆయనపాడిన శైలి అలాగే బతికింది.  అన్నమయ్య ఎలా పాడాడో ఎవరికీ తెలియదు. పైగా అన్నిట్లో అన్నమయ్య స్వేచ్చాజీవి. రాగాలు ఆయనకు కొంతవరకే. జానపద శైలిలో స్వేచ్ఛగా అయన పదం విహరిస్తుంది.

ఈ సౌలభ్యంతో ఎవరికి తోచినట్లు వారు రాగాలు కట్టి అన్నమయ్య పాటకు తామే పట్టాభిషేకం చేసినట్లు తమభుజాలు తామే తట్టుకుని మురిసిపోతున్నారు.

కాళిదాసు

సాహిత్యంలో పోతన స్థాయి, సంగీతంలో నాదోపాసన స్థాయి తెలియకపోతే త్యాగయ్య అందడు. అన్నమయ్య అలా కాదు, ఎండగాని వానగాని, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ సంగీతం అక్షరం ముక్క తెలియనివారుకూడా పాడుకోవడానికి వీలుగా ఉన్నట్లు అనిపిస్తుంది . అన్నమయ్య పదానికి అదే బలం; ఒకరకంగా అదే బలహీనత. దాంతో అన్నమయ్యకే పాఠాలు చెప్పే కొత్త గురువులు పుట్టుకొచ్చారు. గురుపీఠాలు పుట్టుకొచ్చాయి.

గోరుచుట్టుపై రోకటిపోటులాగా ఈ గురువుల పాఠాలకే అన్నమయ్య నోట మాటరాక మౌనంగా ఉంటే…ఈలోపు సినిమావారి సామవేదాన్ని తలదన్నే సినీవేద పాఠాలు మొదలయ్యేసరికి తాళలేక తాళ్ళపాక నిలువెల్లా వణికిపోతోంది.

13వ సంవత్సరం నుండి తుదిశ్వాస వరకు అన్నమయ్య రాసి పాడినవి 32 వేల కీర్తనలు. ఇవికాక ఇతర లక్షణ గ్రంథాలు రాశాడు. దొరికినవి మహా అయితే 14వేల కీర్తనలు. అందులో బాగా పాపులర్ అయినవి ఒక వెయ్యి.  ఈ దొరికినవి ఎవరివల్ల దొరికాయో ? వాటిని తిరగరాసి రాగాలు కట్టడానికి ఒక్కొక్క కీర్తనకు ఎంతకాలం పట్టిందో ఇప్పుడు పట్టాభిషేక సంరభ సన్నాహాల్లో అన్నమయ్యకే పదవిభజన చెబుతున్న పుణ్యపురుషులకు తెలుసో తెలియదో మనకు తెలియదు.

అయినా అన్నమయ్యను ఎంతబాగా అమ్ముకోవాలి? ఎంతగా సొమ్ముచేసుకోవాలి? అన్నది ఆదర్శమయినప్పుడు, అభ్యుదయమయినప్పుడు, అవసరమయినప్పుడు అదే అంగీకారం అవుతుంది. మూలనపడ్డ అన్నమయ్యకు మోక్షమిచ్చిన మహనీయులుగా వీరిని గుర్తించి మెచ్చి మేకతోలు కప్పకపోతే మనదే తప్పవుతుంది.

కాళిదాసు

అన్నమయ్య పదయజ్ఞంలో ఒక రాళ్ళపల్లి, ఒక గౌరిపెద్ది, ఒక వేటూరి ఏమిచేశారో మరచిపోదాం.  నానాటిబతుకు అన్న ఒక్క కీర్తనకు జీవం పోయడానికి ఒక సంగీత సరస్వతికి ఎందుకు ఒకపుష్కరం పట్టిందో మనం తెలుసుకుని ఏమి సాధిస్తాం?

అయినా అన్నమయ్య, అయన పిల్లలు వచ్చి నేను ఇలా పాడలేదు,  ఈ పాటలో నా భావమిదికాదు అని చెప్పుకోలేరు కాబట్టి మనం ఏది పాడితే అదే అన్నమయ్యకు ప్రాప్తం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అమూల్యమననా! ఆణిముత్యమననా

RELATED ARTICLES

Most Popular

న్యూస్