Withdraw the comments: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టిడిపి నుంచి వచ్చిన ఇద్దరు నేతలకు లీజుకి ఇచ్చారంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. నాని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి సిద్ధాంతాలతో పనిచేసే పార్టీ అని, వైసీపీకి అసలు సిద్ధాంతమేలేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ సిద్ధాంతాలపై పేర్ని నానికి కావాలంటే రెండ్రోజులపాటు క్లాస్ తీసుకుంటానని చెప్పారు. తమ పార్టీ గురించి తెలియాలంటే నాని కూడా ఇవాల్సి సభకు రావాలని సోము సూచించారు.
రాజ్యసభ సీట్లు కేటాయించి జిల్లాలను అమ్ముకున్న చరిత్ర వైసీపీకే ఉందని సోము తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికల ముందు 100 కోట్లు తీసుకొని జిల్లాలను రాసిచ్చిన ఉదంతాలు మీ పార్టీలోనే ఉంటాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ అలా కాదని, కార్యకర్తల ఆధారంగా నడిచే వ్యవస్థ ఉందని చెప్పారు. ఒకరిమీద ఆధారపడి జీవిచే పార్టీ బిజెపి కాదని, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడ్డం మానుకోవాలని పేర్ని నానికి సూచించారు.
తమ పార్టీ సభ ప్రారంభం కాకముందే వైసీపీకి సెగ తగిలిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ‘లీజు’ వ్యాఖ్యలు చేయడం తగదని వైసీపీ నేతలను హెచ్చరించారు. వైసీపీ అద్దె మంత్రులు, అద్దె మైకుల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. నేటి సభతోనే వైసీపీ అంతం మొదలైందన్నారు.
పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా బిజెపి నేతలు స్పందించారు. సైకిల్ చక్రం వూదిపోయిందని, అసలు టిడిపిలో ఏమి జరుగుతుందో చూసుకోవాలని బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిడిపి నాయకత్వంఆపై నమ్మకం లేక చాలామంది నేతలు బిజెపిలో చేరుతున్నారని, దానికి భయపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read : బాబు కనుసన్నల్లో బిజెపి సభ : పేర్ని