Call CRPF: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా మర్రిపాడులో అధికార పార్టీ నకిలీ ఓటర్ ఐడీలు తయారు చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మర్రిపాడులో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఆత్మకూరు, ఎఎస్ పేట, అనంతసాగర్ పోలింగ్ బూత్ ల్లో భద్రత పెంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. మొత్తం ఉప ఎన్నికకు సీఆర్పీఎఫ్ బలగాలను వినియోగించాలని కూడా ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరింది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం సిఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించింది.
బిజెపి అభ్యర్థి తో పాటు ఛీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కు భద్రత కల్పించాలని, మర్రిపాడు, ఆత్మకూరు పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ నిలువరించాలని కోరినట్లు ఆ తర్వాత సోము వీర్రాజు మీడియాకు వెల్లడించారు. వైసీపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని, లేకపోతే ఓటర్లకు నగదు పంచాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మర్రిపాడులో ఎన్నికల విధులను వేరొక అధికారికి అప్పగించాలని, వాలంటరీ వ్యవస్థను అధికార పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనకుండా నిరోధించాలని, బిజెపి అభ్యర్థి భార్యతో ఘర్షణకు దిగినవారిని తక్షణం అరెస్టు చేయాలని సోము డిమాండ్ చేశారు.
Also Read : ఆత్మకూరులో పోటీ చేస్తాం: సోము వీర్రాజు