వినాయక చవితి పందిళ్ళకు ఫర్మ్ విద్యుత్,పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటూ డిజిపి జారీ చేసిన ఉత్తర్వులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. హిందువుల పండుగలకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఈ విషయమై సిఎం కు లేఖ రాస్తే అయన తాబేదార్లు కొందరు రెచ్చిపోయి తనపై విమర్శలు చేశారంటూ మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలపై సోము పరోక్షంగా మండిపడ్డారు.
తాము వినాయక చవితి ఆంక్షలపై మాట్లాడితే వారు పోలవరం అంశాన్ని ప్రస్తావిచడంలో అర్ధం లేదని వీర్రాజు వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది తప్పేమీ లేదని, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకుందని, అంచనాలు అమాంతంగా పెరగడంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఎదురుదాడి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకూ 15వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఈ ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని, కేంద్ర నిధుల అంశంపై చర్చించేందుకు తాను స్వయంగా వస్తానని, ఏ ఛానల్ లో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే రావాలని విష్ణుకు వీర్రాజు సవాల్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చి విమర్శలు చేయగానే ఆరాత్రే ఢిల్లీ వెళ్ళారని, కానీ అక్కడ ఎవరికీ ఏ హామీలూ ఉండవని ఇటీవల సిఎం ఢిల్లీ టూర్ పై వ్యంగ్యాస్త్రం విసిరారు. అవినీతి, కుటుంబ పార్టీలతో బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.