Amaravathi Capital: తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఒక దశ-దిశా లేకుండా పనిచేస్తోందని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మండల స్థాయి సమావేశాలు ఏపీ బిజెపి నేడు నిర్వహిస్తోంది. మొత్తం 920 పార్టీ సంస్థాగత మండలాల్లో జరుగుతోన్న ఈ సమావేశాల్లో భాగంగా కృష్ణా జిల్లా వత్సవాయిలో జరిగిన భేటీలో వీర్రాజు పాల్గొన్నారు. అంతకుముందు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
అనంతరం సోము మీడియాతో మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు సరిపోతాయని రైతులు చెబుతున్నారని, 2024లో తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని, మూడు విడతల్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇదే విషయాన్ని తిరుపతమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నానని వీర్రాజు అన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు నిండి ఎనిమిదో ఏట ప్రవేశించామని, కేంద్రం ప్రజలకోసం ఎన్నో పథకాలు తెచ్చారని, కేంద్రం పంచాయతీలకు నిధులు అందిస్తోందని, జల జీవన్ మిషన్, ఎల్ఈడీ బల్బుల పంపిణీ, 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తోందని చెప్పారు. ఉపాధి హామీ నిధులతోనే రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు నిర్మిస్తున్నారని, నిధులు మోడీవి- డబుల్ స్టిక్కర్లు మీవా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేడు అందించిన రైతు భరోసా నిధుల్లో కూడా కేంద్రం వాటా ఉందని… ఈ అన్ని విషయాలపై వైసీపీ ప్రభుత్వంతో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీర్రాజు చెప్పారు.
Also Read : ఆలోచించి మాట్లాడాలి: విపక్షాలపై సోము ఫైర్