శ్రీశైలం దేవస్థానాన్ని ఇప్పటికే అన్యమతస్తులు ఆక్రమించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ నెల 24 రోజుల నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తానని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని పూజలు చేస్తానని అయన ఎద్దేవా చేశారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించడం అక్షేపణీయమన్నారు. దేవాలయాల అభివృద్ధి మరచిన ప్రభుత్వం ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఏర్పాట్లు చేస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు.
గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కొలువైన ప్రసిద్ధ మహంకాళి అమ్మవారిని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
జాబ్ క్యాలండర్ ను సవరించి మళ్ళీ విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.