Sunday, January 19, 2025
HomeTrending Newsరాజీనామా ఆమోదంపై న్యాయపోరాటం: గంటా

రాజీనామా ఆమోదంపై న్యాయపోరాటం: గంటా

రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని, ఈ నిర్ణయంతో సిఎం జగన్ రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఎలాంటి పోరాటం చేయలేదని, ప్రధాని మోడీతో ఒక్కసారి కూడా సిఎం జగన్  మాట్లాడలేదని విమర్శించారు. తాను 2021 ఫిబ్రవరి 22న  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి డిమాండ్ మేరకు రాజీనామా చేస్తే… దాదాపు మూడు ఏళ్ళపాటు తాత్సారం చేసి మరో నెలరోజుల్లో సాధారణ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆమోదించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విశాఖలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజీనామా చేసినప్పుడు వెంటనే ఆమోదించి ఉంటే బాగుండేదని, కానీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎమిటని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో స్పీకర్ నిబంధనలు పాటించలేదని, నిర్ణయానికి ముందు కనీసం తనను సంప్రదించలేదని ఆరోపించారు. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమా కాదా అనేది అడిగిన తర్వాతే  తుది నిర్ణయం ప్రకటించాలని, అలాంటిది  స్పీకర్ కనీస ధర్మాన్ని కూడా పాటించలేదని అన్నారు.  రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రాజకీయ కుట్ర కోణంతో, దురుద్దేశంతో, విలువలు పక్కనపెట్టి, సంప్రదాయాలు పాటించకుండా ఈ నిర్ణయం  వెల్లడించారని, కానీ వారు ఏం ఆలోచనతో అది చేశారో అది నేరవేరబోదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తాను తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికైనా వైసీపీకి చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, దీనికోసం తాము పోరాటం చేస్తామని దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్