Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజాతీయ రహదారులపై పెరగనున్న వేగం

జాతీయ రహదారులపై పెరగనున్న వేగం

High Speed: జాతీయరహదారులపై గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలుగా త్వరలో పార్లమెంటులో చట్ట సవరణను ప్రతిపాదించనున్నట్లు సంబంధిత శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈమధ్య అనేక చోట్ల ప్రకటించారు. విజయవాడ సభలో కూడా చెప్పారు. భౌతికంగా టోల్ గేట్లను తీసేసి జి పి ఎస్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కృత్రిమ మేధా యంత్రం గుర్తించి ఆటోమేటిగ్గా టోల్ మొత్తాన్ని వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇదివరకే చెప్పారు. “టోల్ గేట్లు ఇక ఉండవు” అన్న అప్పటి వార్తకు నిత్యం రోడ్లమీద పడి తిరిగే నాలాంటివారు ఆనందంతో తబ్బిబ్బు అయి ఒక్కక్షణం ఎగిరి గంతేశారు. టోల్ గేట్లు ఉండవు కానీ…తోలు ఒలిచే టోల్ వసూలు మాత్రం ఉంటుందని తెలియగానే ఆనందం ఆవిరి అయ్యింది.

Speed Limit

హైదరాబాద్- విజయవాడ మధ్య దూరం 275 కిలోమీటర్లు. నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి. నాలుగున్నర లేదా అయిదు గంటల ప్రయాణం. కారులో రాను పోను టోల్ గేట్లకు వెయ్యి రూపాయలు అవుతోంది. డీజిల్ ఖర్చు అయిదు వేలు. ఆంధ్ర సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వచ్చేదాకా తెలంగాణాలో స్పీడ్ 80 దాటడానికి వీల్లేదు. కొన్ని చోట్ల 60, మరికొన్ని చోట్ల 40 దాటడానికి వీల్లేదు. రోడ్డు బాగున్నా, ఖాళీగా ఉన్నా నత్తకు నడకలు నేర్పుతూ, తాబేలుకు పరుగులు నేర్పుతూ…జోగుతూ వెళ్ళాలి. కొంచెం స్పీడ్ పెరిగిన ప్రతిసారి హైవే చెట్ల చాటున దాగిన తెలంగాణ పోలీసు డేగ కన్ను స్పీడ్ గన్ క్లిక్ మనిపించి వెనువెంటనే పంపే పెనాల్టీ మెసేజ్ వస్తుంది. ఇప్పుడే మీ ఫలానా నంబరు కారు చిట్యాల ఊరవతల ఒక మానభంగం, రెండు కిడ్నాప్ లు, మూడు మర్డర్లు చేసి పారిపోతుండగా మా కెమెరా ఫోటో తీసినది…ఇట్లు తెలంగాణా ఫ్రెండ్లి పోలీసు అని భయపెట్టే భాషలో ఫోన్ కు మెసేజ్ క్షణం ఆలస్యం కాకుండా వస్తుంది.

స్పీడ్ లిమిట్ దాటినట్లు ఒకసారి పోలీసు కెమెరా ఫోటో క్లిక్ చేస్తే 1035 రూపాయల పెనాల్టీ. వెయ్యిన్నూట పదహార్ల సన్మానంలా వెయ్యికి మరో 35 ఏమిటో లెక్క? పెనాల్టీకి  ట్యాక్సో లేక ఎండల్లో వానల్లో చలిగాలుల్లో నక్కి నక్కి ఫోటోలు తీసే పోలీసు జీతానికి తగిన మొత్తమో? వెళ్లేప్పుడు వచ్చేప్పుడు రెండు మూడు పోలీసు ఫోటోలకు మూడు వేలు, టోల్ గేట్లకు వెయ్యి, డీజిల్ కు అయిదు వేలు, చిల్లర ఖర్చులకు ఇలా అన్నీ కలిపి ఒక పనిలేనిరోజు లెక్కలు వేస్తే…ఇరవై కిలోమీటర్ల వేగంతో ఒకరోజంతా ప్రయాణించడం లేదా ఎనిమిది వందలు పెట్టి వోల్వో డబుల్ యాక్సిల్ బస్సెక్కి వెళ్లడం ఉత్తమం అన్న జ్ఞానం కలిగింది. బస్సెక్కగానే చెవుల్లో రక్తం కారేంత హై పిచ్ ధ్వనితో ఉచిత ప్రాథమిక నిర్బంధ సినిమా ప్రదర్శన మొదలవుతుంది. కేవలం ఈ నిర్బంధ విధ్వంసాన్ని తట్టుకోలేకే నేను చాలాసార్లు కారులో వెళ్లి చేతి చమురు వదిలించుకుంటూ ఉంటాను.

కోవిడ్ మొదలయ్యాక నష్టాలకు తోడు ఈ పోలీసు పెనాల్టీల అదనపు నష్టం ఎందుకని కారు పెన్ డ్రైవ్ లో పెట్టుకున్న మూడు వేల ఘంటసాల పాటలు వింటూ…విజయవాడ వచ్చినప్పుడు నిద్రలేపమని పాడుకుంటూ…పడుకుంటూ…లేస్తూ ఉంటాను. దాంతో మూడేళ్లుగా ఘంటసాల గాన మాధుర్యం మీద అనురక్తి దినదిన ప్రవర్ధమానమయ్యింది. పాట ఒక ఓదార్పు అంటే ఏమిటో అనుకున్నాను. అగాథమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…అన్న పాటే రోడ్డు మీద ఎక్కువసార్లు వింటున్నట్లు అనిపిస్తుంది నాకు. పోయిన ట్రిప్ లో కూడా ఈ అగాథమే కదా విన్నాను…ఈసారి ఇంకేదన్నా విందాం అని ఫార్వార్డ్ చేయబోతాను. ఈలోపు ఎవరో జ్వాలను రగిలించారు…వేరెవరో దానికి బలి అయినారు…అని ఘంటసాల గొంతు మూగవేదనకు భాష్యం చెబుతుంది.

ఎవరో రోడ్డు వేశారు. ఎవరో టోల్ వసూలు చేస్తున్నారు. ఎవరో స్పీడ్ గన్ ఫోటోలు తీస్తున్నారు. వేరెవరో దానికి బలి అయి అగాథంలో కూరుకుపోతున్నారు…అని అత్యంత సందర్భ శుద్ధితో నా పరిస్థితి నేపథ్యంలో ఘంటసాల పాడుతున్నట్లు తాదాత్మ్యంలోకి జారుకుంటాను. ఈలోపు మా డ్రైవర్ సార్ సెవెన్ వచ్చింది అంటాడు. ఇద్దరం టీ తాగడానికి అక్కడో నూట ఇరవై టీ పెనాల్టీ చెల్లించుకుని మళ్లీ రోడ్డెక్కుతాం. ఏ పి లోకి ప్రవేశించగానే వంద స్పీడు దాటి వెళ్లవచ్చు. ఒకే ప్రయాణమయినా ఒక రాష్ట్రంలో జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్, మరో రాష్ట్రంలో అదే జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ లేని ప్రయాణం. శాంతి భద్రతలు రాష్ట్రాల అంశం. ఈ స్పీడ్ లిమిట్- లిమిట్ లెస్ కూడా రాష్ట్రాల అంశమై ఉంటుంది.

AP Developing Nitin Gadkari

ఆ మధ్య కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ ఉత్తర భారతంలో ఒక జాతీయ రహదారిపై కారులో ప్రయోగాత్మకంగా 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించారు. దేశవ్యాప్తంగా ఇకపై జాతీయ రహదారులమీద గంటకు 120 కిలోమీటర్ల వేగం దాటి వెళ్ళడానికి గడ్కరీ సుముఖంగా ఉన్నట్లున్నారు. అయితే దీనికి పార్లమెంటులో చట్ట సవరణ జరగాలి.

త్వరగా చట్టాన్ని మార్చండి గడ్కరీ గారూ. స్పీడ్ లిమిట్ వయొలేషన్ పెనాల్టీలు కట్టడానికే కష్టపడి సంపాదించాల్సి వస్తోంది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

డ్రైవర్లు లేకుండా తిరిగే వాహనాలు

Also Read :

ఆగి ఆగి సాగిన ప్రయాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్