Typographical mistake: “ఈ ప్రకటనలో ఏమైనా ముద్రణా దోషాలుంటే సహృదయంతో స్వీకరించి…వీలయితే మా దృష్టికి తీసుకురాగలరు”
Disclaimer: Any Inadvertent error published in this advertisement could be brought to our notice
అని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ఫుల్ పేజీ రంగు రంగుల ప్రకటనల్లో కంటికి కనిపించనంత చిన్న అక్షరాల్లో, చదవడానికి వీలు కాకుండా నిలువు గీతలో కనిపిస్తోంది.
ఎవరు అవునన్నా…కాదన్నా…శ్రీచైతన్య, నారాయణ ఆకాశం పట్టనంతగా ఎదిగిన విద్యా సంస్థలు. ప్రభుత్వ వ్యవస్థలను శాసించగల ప్రయివేటు విద్యా వ్యవస్థలు. ఎన్ని అవస్థలు పడి అయినా తమ పిల్లలను అక్కడే చేర్పించాలనుకునే మహా వట వృక్షాలు. వాటి స్వరూప స్వభావాలు, గుణగణాల మీద చర్చ నిరుపయోగం కాబట్టి దాన్ని లోకానికి వదిలేసి…వారి ప్రకటనలో వారే ముందుగానే పసిగట్టి దొర్లుతాయనుకున్న “ముద్రణా దోషాల” గురించే మాట్లాడుకుందాం.
1. వీరి ప్రకటనల్లో ముప్పయ్ ఏళ్లుగా లేని ముద్రణా దోషాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయి?
2. ఏమయినా ముద్రణా దోషాలుంటే సహృదయంతో మనమెందుకు స్వీకరించాలి?
3. స్వీకరించి…వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మనకెందుకుంటుంది?
4. రోజూ పొద్దున్నే పేపర్ ప్రకటనల్లో తప్పొప్పులు చూసి…ఆయా కంపెనీలకు ఇలాగే సహృదయంతో వారి దృష్టికి తీసుకెళ్లాలంటే…పాఠకులకు మొదట అంత దృష్టి ఉండాలి. ఉండి అది పని చేయాలి. చేసి…వారిని కలిసి…ప్రాధేయపడి…వారికి విన్నవించుకోవాలి. ఈ ఖర్మ పాఠకులకు ఎందుకు? ఏ జన్మలో పాపానికి ఇప్పుడు ఈ శిక్ష?
5. అంతంత పెద్ద యాడ్ ఏజెన్సీలకు కోట్లకు కోట్లు డబ్బులిచ్చి చేయించుకునే ప్రకటనల్లోనే తప్పుల్లేకుండా చూసుకోలేని వాళ్లు…ఇక తప్పుల్లేకుండా పిల్లలకు చదువులేమి చెప్తారు?
6. అక్కడ చదివే పిల్లలు కూడా పరీక్షల్లో ఆన్సర్ షీట్ అంతా రాసి…చివర ఇలాగే “ఏమయినా అక్షర దోషాలు ఉంటే పెద్ద మనసుతో స్వీకరించి…మీ దృష్టి మళ్లించి…కరుణించి…మార్కులు వేసి…రక్షించండి” అని రాస్తే పాసవుతారా? అలా పాస్ అయినా దాన్ని పాస్ అంటారా?
7. ఎక్కడో చదివి మొదటి ర్యాంక్ వస్తే వారి ఫోటోలను తమ సంస్థ ప్రకటనల్లో వేసుకోవడానికి వారికి కోట్లకు కోట్లు ఇచ్చినట్లు ఇదివరకే పుకార్లు షికార్లు చేశాయి.
8. మూడేళ్ళ క్రితం జె ఈ ఈ ఆలిండియా టాపర్ ఒకే మనిషి అయిదు సంస్థల్లో చదివినట్లు ప్రకటనలు వచ్చాయి. సూర్యుడు తిరిగే వేగంతో సమానంగా ఖగోళంలో తిరుగుతూ హనుమంతుడు సూర్యుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. అలా ఈ మానవాతీత పిల్లలు కూడా ఒకే రోజు ఒకే సమయంలో దేశంలో అయిదు ప్రాంతాల్లో అయిదు కోచింగ్ సెంటర్లకు అటెండ్ అయి ఉంటారు. కలి మహిమ మరి!
9. ఇలాంటి మోసాలు బయటపడ్డా డ్యామేజ్ జరగకుండా…లీగల్ గా ఇబ్బందులు రాకుండా ముందే “ముద్రణా దోషాల” ముసుగు కప్పుకున్నారు.
పూజంతా అయ్యాక-
“యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్తత్సర్వం
క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే।
విసర్గ బిన్దు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః”
అని విధిగా చెప్పాలి. ఒక్క పదం, ఒక్క అక్షరం, ఒక్క సున్నా, ఒక్క అర సున్నా, ఒక్క విసర్గ, ఒక్క ఫుల్ స్టాప్, ఒక్క కామా తప్పు పలికినా క్షమించు “నారాయణా!” అని ఈ డిస్ క్లైమర్ అర్థం.
సృష్టిలో ఒకప్పుడు ఉండినది; ప్రస్తుతం ఉన్నది; ఎప్పటికీ ఉండేది-
“నారాయణ చైతన్యం”
ఒక్కటే.
అలాంటి నారాయణ చైతన్యానికే ముద్రణా దోషాలను ముందే ఒప్పేసుకునే సంస్కారం కూడా తోడయితే… ఇక ఆ బంగారానికి తావి అబ్బినట్లే!
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః”
అని మంత్ర ప్రమాణం. యుగాన్ని బట్టి నారాయణ చైతన్యం రూపం మారుతూ ఉంటుంది. అది మనలాంటి మామూలు మాంస నేత్రాలు చూడగలిగే చైతన్యం కాదు. “దివ్యం – దదామి – తే – చక్షుః” దేవుడిని చూడగలిగే దివ్య నేత్రాలను దేవుడే ఇవ్వాలి అని నారాయణుడు స్పష్టంగా ద్వాపరయుగంలో కురుక్షేత్రం వార్ ఫీల్డ్ నడి మధ్యలో చెప్పాడు.
ఈ ప్రకటనల్లో “ఏమయినా ముద్రణా దోషాలు” పొరపాటున దొర్లినా…ఉద్దేశపూర్వకంగానే దొర్లించినా…కనుక్కోగలిగిన దివ్య నేత్ర చైతన్యం కూడా మనకు నారాయణుడే ఇవ్వాలి. ఆ నారాయణ దివ్య చైతన్యం మన కళ్లకు కలిగేదాకా-
నారాయణ!
నారాయణ!!
అని మన పారాయణ చైతన్యాన్ని సహృదయంతో స్వీకరించి దేవుడి దృష్టికి తీసుకెళ్లడమే మన తక్షణ కర్తవ్యం!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :